రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
  • పైడూరుపాడులో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు స్పష్టం చేశారు. విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడు గ్రామంలో సోమవారం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పత్రాలపై వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చి పట్టాదారు పాసుపుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫొటో ముద్రించారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలను అందజేస్తూ ప్రభుత్వ గౌరవాన్ని, అధికారికతను కాపాడుతోందని పేర్కొన్నారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇందుకోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. భూముల రికార్డులను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి అర్హత ఉన్న రైతుకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తున్నామని వివరించారు. రైతుల హక్కులను పరిరక్షించడంలో పాసు పుస్తకాలు కీలకమని అన్నారు. బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలకు ఈ పుస్తకాలు ఉపయోగపడతాయన్నారు. అన్నదాతలను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అందులో భాగంగానే ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.

ఈ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి రూ.20 వేల పెట్టుబడి సాయం అందుతోందన్నారు. ఈ సాయంతో రైతుల ఆర్థిక భారం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలు వేగంగా సాగుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేరుస్తున్నామని తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దీంతో రాష్ట్రం పురోగతి దిశగా పయనిస్తోందని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు రాష్ట్రానికి ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వం ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిబద్ధత, మంత్రి నారా లోకేష్ సమర్థతతో అభివృద్ధి సాధిస్తున్నామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీ వేగంగా ముందుకు వెళ్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు గాంధీ కూటమి కుటుంబ సభ్యులు, అధికారులు, రైతులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు