ఆలయ భూమి ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు
మరిపెడ, ఆంధ్రప్రభ: మాజీ పార్లమెంట్ సభ్యుడు రామసహాయం సురేందర్ రెడ్డి ఆలయానికి దానం చేసిన భూమిని అక్రమంగా ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు, అదే స్థలాన్ని వ్యవసాయ భూమిగా చూపిస్తూ రైతుబంధు పథకం కింద లబ్ధి పొందుతున్నారని ఆరోపిస్తూ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై గ్రామ పెద్దలు సోమవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్‌కు ఫిర్యాదు చేశారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని మాకుల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి మాజీ ఎంపీ రెండు ఎకరాల భూమిని దానం చేశారని, అయితే మాజీ ఆలయ మేనేజర్ బోగోజు భిక్షమాచారి, ప్రస్తుత అర్చకుడు నల్ల చక్రవర్తుల లక్ష్మణాచార్యులు కలిసి సుమారు ఎనిమిది గుంటల భూమిని ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ ఇళ్లను తమ భార్యల పేర్లపై గ్రామపంచాయతీ రికార్డుల్లో నమోదు చేయించుకుని, అదే భూమిని వ్యవసాయ భూమిగా చూపిస్తూ గత 10–12 సంవత్సరాలుగా రైతుబంధు ఆర్థిక సాయం పొందుతున్నారని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రైతుబంధు కింద పొందిన నిధులను రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం తిరిగి వసూలు చేయాలని కలెక్టర్‌ను గ్రామ పెద్దలు కోరారు.
