ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేయాలి

  • సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’
  • విజయవంతం చేయాలని సీపీఐ విజయ సారథి పిలుపు

తొర్రూరు, ఆంధ్రప్రభ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయ సారథి పిలుపునిచ్చారు.

మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సీపీఐ జిల్లా రాజకీయ, సైద్ధాంతిక శిక్షణా తరగతుల రెండో రోజు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న లక్షలాది మందితో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

మోదీ పాలనలో దేశం వెనుకబడిందని, కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి సామాన్య ప్రజల ప్రయోజనాలను విస్మరించారని విమర్శించారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయాయని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి కార్మికులను మోసం చేశారని అన్నారు.

దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, సెప్టెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు అందించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కూడా డిమాండ్ చేశారు. శిక్షణా తరగతుల్లో సింగు నరసింహారావు, శంకర్, నారాయణ, జితేందర్ రెడ్డి, విజయ సారథి వివిధ అంశాలపై ప్రతినిధులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తమ్మెర విశ్వేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి. అజయ్ సారధి రెడ్డి, నల్లు సుధాకర్ రెడ్డి, కట్టెబోయిన శ్రీనివాస్, ఓమ బిక్షపతి, బందు మహేందర్, కిరణ్, లక్ష్మణ్, పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, మామిండ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగాచారి, వరిపల్లి వెంకన్న, నెల్లూరు నాగేశ్వరరావుతో పాటు జిల్లా కౌన్సిల్ సభ్యులు, ప్రతినిధులు, వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.