నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

  • జాయింట్ కలెక్టర్‌కు అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల వినతి..
  • విచారణ జరిపించాలని డిమాండ్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌కు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చౌటుప్పల్ మండల పరిధిలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అనుమతులు, భవన ఫిట్‌నెస్ లేకుండా, ఒకే అనుమతితో బహుళ బ్రాంచ్‌లు నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. అదేవిధంగా, చౌటుప్పల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సోమవారం నిర్ణీత సమయానికి తెరుచుకోకపోవడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పక్కనే మండల విద్యాధికారి (ఎంఈఓ) కార్యాలయం ఉన్నప్పటికీ పర్యవేక్షణ లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు.

ఈ అక్రమాలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై జిల్లా స్థాయి ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించి, నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై, బాధ్యులైన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరమల్ల కార్తీక్ గౌడ్, దిండు భాస్కర్, నలపరాజు రమేష్, ఒంటెద్దు లింగస్వామి, వినయ్ రెడ్డి, ఊదరి రాకేష్, శివ తదితరులు పాల్గొన్నారు.