మీసేవ కేంద్రంలో పాము కలకలం
కరీమాబాద్, ఆంధ్రప్రభ: నగరంలోని శివనగర్ మీసేవ కేంద్రంలో సోమవారం సాయంత్రం పాము ప్రత్యక్షమై కలకలం రేపింది. మీసేవ కేంద్రం నుంచి బయటకు వచ్చిన పాము సమీపంలోని ఓ ఇంట్లోకి దూరడంతో అక్కడ ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పాములు పట్టే నిపుణులకు సమాచారం అందించగా, వారు దాదాపు గంటపాటు శ్రమించి పామును సురక్షితంగా పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను చూసేందుకు వందలాది మంది అక్కడికి చేరుకున్నారు.
శివనగర్‌లో మీసేవ కేంద్రం, వరంగల్ మండల కార్యాలయం ఒకే ప్రాంతంలో ఉండటంతో ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు అక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే కార్యాలయ పరిసరాల్లో చిత్తడి, పొదలు పెరిగిపోవడంతో పాములు, తేళ్లు సంచరిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మీసేవ కేంద్రం పరిసరాలను శుభ్రం చేయించి, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డివిజన్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
