సహకార సంస్కరణలతో రైతు సంక్షేమానికి అవకాశం
- మోదీ,అమిత్ షా నాయకత్వంలో పారదర్శకంగా సహకార రంగం
- సాంకేతికంగా బలోపేతం అవుతున్న వ్యవస్థ..
- కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాం
ఆంధ్రప్రభ, విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకార రంగాన్ని దేశ అభివృద్ధిలో కీలక శక్తిగా తీర్చిదిద్దిందని, కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా చేపట్టిన సంస్కరణలు రైతు సంక్షేమానికి కొత్త దిశను చూపుతున్నాయని కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (కేడీసీసీబీ) చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాం పేర్కొన్నారు.
న్యూఢిల్లీలోని భారత్ మండపం లో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ నిర్వహించిన సహకార్ సే సమృద్ధి – 5 స్వర్ణిమ్ సంవత్సరాలు జాతీయ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు , రాష్ట్ర సహకార బ్యాంకులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తున్నాయని ఆయన అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద సహకార ధాన్య నిల్వ పథకం కింద ఆధునిక గోదాముల ఏర్పాటు రైతులకు పంట నిల్వ, మార్కెటింగ్, విలువ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు. అలాగే నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ , సహకార్ సీబీఎస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, కృత్రిమ మేధస్సు ఆధారిత సహకార్ సహయోగి వంటి డిజిటల్ కార్యక్రమాలు సహకార రంగంలో పారదర్శకత, వేగం, జవాబుదారీతనాన్ని మరింత పెంచుతాయని పేర్కొన్నారు.
రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు సహకార వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతున్నాయని, గ్రామీణాభివృద్ధి, రైతుల ఆర్థిక సాధికారత, “సహకారం ద్వారా సమృద్ధి – వికసిత్ భారత్” లక్ష్య సాధనలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని నెట్టెం శ్రీ రఘురాం తెలిపారు. సహకార రంగాన్ని దేశ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాదిగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు పూర్తి సహకారం అందిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
