Indian Streaming | 48 గంటల్లోనే ఓటీటీ నుంచి అవుట్‌..

‘సట్లజ్’ తొలగింపు.. కారణమేంటి?

Indian Streaming |ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: ఎన్నో ఏళ్లుగా వివాదాల్లో చిక్కుకుని ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సట్లజ్’ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రముఖ నటుడు, గాయకుడు దిల్‌జిత్ దోసాంఝ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలైన రెండు రోజుల్లోనే భారత్‌లో అందుబాటులో లేకుండా పోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్నిప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 అధికారంగా ప్రకటించడంతో ఇప్పుడు ఇది హాట్‌ టాపిక్‌ గా మారింది.

జూలై 3న డిజిటల్ వేదికపై విడుదలైన ఈ చిత్రం కొద్ది సమయంలోనే మంచి స్పందనను అందుకుంది. అయితే అనూహ్యంగా ప్లాట్‌ఫామ్ నుంచి సినిమా కనిపించకపోవడంతో ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపై స్పందించిన ఓటీటీ సంస్థ, ప్రస్తుతం ఈ చిత్రాన్ని భారత్‌లో తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. అయితే కొన్ని చట్టపరమైన అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. సమస్యలు పరిష్కారమైన తర్వాత తిరిగి స్ట్రీమింగ్‌కు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.

కాగా ఈ చిత్రం మూడేళ్ల కిందట 2022 లో ‘పంజాబ్ 95’ పేరుతో సెన్సార్‌ బోర్డు వద్దకు వెళ్లింది. అయితే ఇందులోని సున్నిమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు సెన్సార్‌ 127 కట్స్‌ ను సూచించడంతో పాటు మూడేళ్ల పాటు క్లియరెన్స్‌ ఇవ్వలేదు. దీంతో విడుదల పలుమార్లు వాయిదా పడింది.
మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. చివరకు పేరు మార్చుకొని ‘సట్లజ్’ గా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమా తొలగింపుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్‌ను నిలిపివేయడం వెనుక అసలు కారణం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు వెల్లడించకపోవడంతో పలు ఊహాగానాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం భారత్‌లో ఈ సినిమా అందుబాటులో లేకపోయినా, చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అధికారికంగా మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.