నల్లమల అడవిలో క్షుద్ర పూజలు..
- ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది ఆలయం వెనక..
- గుప్తనిధుల కోసం అగంతకులు గుంతలు తవ్వారు..
- స్థానికులు భయాందోళన…
- పోలీసులు దర్యాప్తు ముమ్మరం…
నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిశ్వర స్వామి ఆలయమైన మహానంది ఆలయం వెనక నల్లమల అటవి ప్రాంతంలో క్షుద్ర పూజల ఆనవాళ్లు కలకలం రేపాయి. మహానంది పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆదివారం అర్ధరాత్రి తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది ఆలయానికి వెనుక భాగంలో రెండు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు ఆనవాళ్లు కనిపించాయన్నారు.
ఘటనా స్థలంలో కుంకుమ పసుపు నిమ్మకాయలు పూజ సామాగ్రి వంటి పలు అవశేషాలు కనిపించడంతోపాటు సమీప ప్రాంతంలో గుంతలు తవ్విన ఆనవాళ్లు కూడా బయటపడటంతో గుప్తనిధుల కోసం ఈ క్షుద్ర పూజలు నిర్వహించి ఉండవచ్చని అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
అటవీ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగటం వల్ల స్థానిక ప్రజల్లో భయాందోళన గురయ్యారు. ఘటన స్థలానికి అటవీశాఖ అధికారులు పోలీసులు పరిశీలించి విచారణ ప్రారంభించారు. ఘటనకు సంబంధించి ఫారెస్ట్ బీట్ అధికారుల విధుల్లో ఏమైనా నిర్లక్ష్యం లేదా ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టటం గమనార్హం. అటవీ ప్రాంతంలో క్షుద్ర పూజలు గుంతలు తవ్వి గుప్త నిధులు వేట కోసమే చర్యలకు పాల్పడ్డారా మరి ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
