PNB fraud case | నీరవ్ మోదీ అప్పగింతకు గ్రీన్ సిగ్నల్…
PNB fraud case | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మోసం కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆయన దాఖలు చేసిన చివరి అప్పీల్‌ను తిరస్కరించింది.
భారత జైళ్లలో భద్రత, వైద్య సదుపాయాలు, ఇతర వసతులపై భారత్ ఇచ్చిన హామీలు సంతృప్తికరంగా ఉన్నాయని కోర్టు పేర్కొంది. దీంతో నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడంలో ఉన్న ప్రధాన న్యాయపరమైన అడ్డంకులు తొలగినట్లయ్యాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేల కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులో నీరవ్ మోదీపై భారత దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేశాయి. ఈ కేసులో ఆయనను 2019 మార్చిలో లండన్‌లో అరెస్టు చేయగా, అప్పటి నుంచి అక్కడి జైలులోనే ఉన్నారు. తాజా కోర్టు నిర్ణయంతో నీరవ్ మోదీ అప్పగింత ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.
