వైభవంగా అధ్యయనోత్సవాలు, కళ్యాణోత్సవం ముగింపు

వేములవాడ, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో లోకకళ్యాణార్థం జూలై 2 నుండి జూలై 6, 2026 వరకు నిర్వహించిన అధ్యయనోత్సవాలు మరియు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం – భక్తోత్సవం సోమవారం అత్యంత వైభవంగా ముగిశాయి.

ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 6:30 గంటల నుంచి స్వామివారికి పంచోపనిషత్ మంత్రాలతో అభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 4:05 గంటల నుంచి తొళ్లెర్కం, ద్రావిడ వేదపారాయణం, నీరాజనం, మంత్రపుష్పం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

సోమవారం ఉదయం 11:30 గంటలకు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి దివ్య కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, సదస్యం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. రాత్రి 8:30 గంటలకు ఏకాంత సేవతో ఐదు రోజుల ఉత్సవాలు సంపూర్ణంగా ముగిశాయి. ఈ దివ్య కళ్యాణ మహోత్సవానికి కన్యాదాతలుగా శ్రీ భాను ఆచార్య – శ్రీమతి క్రాంతి దంపతులు సేవలందించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీమతి ఎల్. రమాదేవి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె వెంట ఏఈవో శ్రావణ్ కుమార్, పర్యవేక్షకులు నరేందర్, ఆలయ ఇన్‌చార్జి స్థానాచార్యులు, ఆలయ అర్చకులు, వేదపండితులు, వైష్ణవ అర్చకులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఉత్సవాలకు హాజరై స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.