Allu Arjun | వర్చువల్‌గా కోర్టుకు హాజరైన అల్లు అర్జున్
సంధ్య థియేటర్ కేసు విచారణ..
500 పేజీల ఛార్జ్‌షీట్ ప్రతులను నాంపల్లి కోర్టుకు సమర్పించిన పీపీ
ముంబైలో షూటింగ్‌లో ఉండటంతో వర్చువల్ హాజరుకు అనుమతి..
తదుపరి విచారణ జూలై 29కి వాయిదా
Allu Arjun | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నటుడు అల్లు అర్జున్ ముంబైలో సినిమా చిత్రీకరణలో ఉండటంతో న్యాయస్థానం అనుమతితో వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులకు సంబంధించిన సుమారు 500 పేజీల ఛార్జ్‌షీట్ ప్రతులను ప్రభుత్వ తరఫు న్యాయవాది (పీపీ) కోర్టుకు సమర్పించారు. కేసు విచారణలో భాగంగా నిందితుల హాజరును నమోదు చేశారు.
ముంబైలో షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు వర్చువల్ హాజరుకు అనుమతి కోరగా, కోర్టు అందుకు అంగీకరించింది. దీంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొన్నారు. అయితే ఈ కేసులోని మరికొందరు నిందితులు వ్యక్తిగత కారణాలతో కోర్టుకు హాజరుకాలేదు. వారి గైర్హాజరు నేపథ్యంలో తదుపరి విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఛార్జ్‌షీట్ సమర్పణతో కేసు విచారణ తదుపరి దశకు చేరింది. జూలై 29న జరిగే విచారణలో తదుపరి న్యాయపరమైన ప్రక్రియ కొనసాగనుంది.
