Cristiano Ronaldo | ‘ఇదే నా చివరి ప్రపంచ కప్’
భావోద్వేగంగా ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో
2026 ఫిఫా ప్రపంచకప్‌తో వరల్డ్‌కప్ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు స్పష్టం
‘రిటైర్మెంట్ ఎప్పుడు అనేది నేనే నిర్ణయిస్తా..
ప్రస్తుతం నా దృష్టి జట్టును విజేతగా నిలపడంపైనే’ అని వ్యాఖ్య
Cristiano Ronaldo | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన అభిమానులకు భావోద్వేగ సందేశం ఇచ్చాడు. 2026 ఫిఫా ప్రపంచకప్ తన కెరీర్‌లో చివరి ప్రపంచకప్ టోర్నమెంట్ అని అధికారికంగా ప్రకటించాడు. అయితే తన అంతర్జాతీయ కెరీర్‌కు వెంటనే ముగింపు పలుకుతున్నానని కాదు, ఇంకా జట్టుకు సేవలందించాలని ఆశిస్తున్నానని స్పష్టం చేశాడు.
స్పెయిన్‌తో జరగనున్న రౌండ్ ఆఫ్-16 మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన రొనాల్డో, ఈ ప్రపంచకప్‌ను పూర్తిస్థాయిలో ఆస్వాదించాలని కోరుకుంటున్నానని తెలిపాడు. “ఆటను ఎంత వరకు ఆస్వాదించామనేదే ముఖ్యం. ఇదే నా చివరి ప్రపంచకప్. అయితే ఈ టోర్నీలో రేపటి మ్యాచే నా చివరి మ్యాచ్ కాకూడదని ఆశిస్తున్నాను” అని వ్యాఖ్యానించాడు.
41 ఏళ్ల రొనాల్డోకు ఇది ఆరో ప్రపంచకప్ కావడం విశేషం. ఈ టోర్నీలో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు గోల్స్ నమోదు చేశాడు. తన ప్రపంచకప్ కెరీర్‌లో మొత్తం 11 గోల్స్ సాధించి మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు.
రిటైర్మెంట్‌పై వస్తున్న ప్రశ్నలకు కూడా రొనాల్డో ఘాటుగా స్పందించాడు. “నేను ఎప్పుడు రిటైర్ కావాలనుకుంటే అప్పుడే అవుతాను. అది నేను తీసుకునే నిర్ణయం. పదేపదే ఈ ప్రశ్న అడిగి సమయం వృథా చేయొద్దు. ప్రస్తుతం నా పూర్తి దృష్టి తదుపరి మ్యాచ్‌పైనే ఉంది” అని చెప్పాడు.
జట్టు కోసం ఎప్పుడూ అంకితభావంతో ఉంటానని రొనాల్డో పేర్కొన్నాడు. “నేను మైదానంలో ఉన్నా, బెంచ్‌పైన ఉన్నా జట్టుకు అవసరమైన సహకారం అందిస్తాను. నా శరీరం, మనసు రెండూ జట్టు విజయానికే అంకితం” అని స్పష్టం చేశాడు.
ఈ ప్రపంచకప్ తనకు చివరిదైనా, పోర్చుగల్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలపాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగామని రొనాల్డో ధీమా వ్యక్తం చేశాడు. “ప్రపంచకప్ గెలుస్తామనే నమ్మకం లేకపోతే మేము ఇక్కడికి వచ్చేవాళ్లం కాదు. ప్రతి మ్యాచ్‌తో మా ఆట మరింత మెరుగవుతోంది. ఇప్పటికే పలువురు బలమైన జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మా జట్టు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉంది. పూర్తి సన్నద్ధతతో తదుపరి పోరుకు సిద్ధంగా ఉన్నాం” అని పేర్కొన్నాడు.
ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచిన రొనాల్డోకు ఇది చివరి ప్రపంచకప్ కావడం అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది. అయితే ట్రోఫీతో తన ప్రపంచకప్ ప్రయాణాన్ని ముగించాలని ఆయన పట్టుదలగా ఉన్నాడు.
