రేబిస్ టీకాలతో పెంపుడు కుక్కలకు ఆరోగ్యం..

నిజాంపేట, ఆంధ్రప్రభ: పెంపుడు జంతువులకు ముందస్తుగా టీకాలు వేయించడం ద్వారా వాటిని వ్యాధుల నుంచి రక్షించవచ్చని ఎంపీడీవో రాజిరెడ్డి అన్నారు.

ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజాంపేట ప్రాథమిక పశు వైద్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రేబిస్ టీకాల కార్యక్రమాన్ని ఎంపీడీవో రాజిరెడ్డి, స్థానిక సర్పంచ్ నరేందర్ కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వెటర్నరీ లైవ్‌స్టాక్ అసిస్టెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ, పెంపుడు జంతువుల యజమానులు వాటి ఆరోగ్యం, వ్యాధుల నివారణ విషయంలో అప్రమత్తంగా ఉండి తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. కుక్కలు, పిల్లుల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మొత్తం తొమ్మిది కుక్కలకు రేబిస్ వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీఓ రజినీకాంత్, సీనియర్ అసిస్టెంట్ కలీముల్లా, ఉప సర్పంచ్ బాబు, పంచాయతీ కార్యదర్శి సరితాదేవి, గోపాలమిత్రులు సంతోష్ రెడ్డి, బాబు, స్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు.