బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం..

  • దళిత సంఘాల నాయకులు

ఊట్కూర్, ఆంధ్రప్రభ: వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరువలేనివని దళిత సంఘాల నాయకులు హాజమ్మ, కొండను గోపాల్ అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో సోమవారం బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా దళిత సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడిగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడిగా, భారత మాజీ ఉప ప్రధానిగా విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని దేశ సేవ చేశారని గుర్తు చేశారు.

స్వాతంత్ర్యం అనంతరం మూడు దశాబ్దాలకు పైగా కేంద్ర మంత్రిగా వివిధ కీలక శాఖలను నిర్వహిస్తూ దళితులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని కొనియాడారు. సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆయన నిరంతరం పోరాడారని తెలిపారు.

వ్యవసాయం, రక్షణ, కార్మిక సంక్షేమం వంటి కీలక రంగాల్లో విశేష సేవలు అందించిన బాబు జగ్జీవన్ రామ్ నిజాయితీ, ప్రజాసేవ, అంకితభావంతో భారత రాజకీయ చరిత్రలో గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండన్ భారత్, కొక్కు నరసింహ, తిమ్మప్ప, సహదేవ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.