ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై పేరెంట్స్ గళం.. నర్సంపేటలో నిరసన..
నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేటలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారం రోజురోజుకూ పెరుగుతోందంటూ పేరెంట్స్ కమిటీ సభ్యులు అమరవీరుల స్తూపం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పక్కనపెట్టి కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. దీనివల్ల మధ్యతరగతి, పేద కుటుంబాల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యాశాఖ అధికారులు వెంటనే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యను వ్యాపారంగా మార్చకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుని తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు. అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
