Sensex | మార్కెట్లకు సానుకూల సంకేతాలు..

Sensex | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్ రంగంలో రానున్న రోజుల్లో మెరుగైన వృద్ధి నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఆ రంగ షేర్లలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్ల కొనుగోళ్లు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు కూడా సూచీలకు బలాన్నిస్తున్నాయి.

గత ట్రేడింగ్ సెషన్‌లో విదేశీ మదుపర్లు రూ.1,355 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.26 వద్ద కొనసాగుతోంది.

గత సెషన్ ముగింపు 77,138 పాయింట్లతో పోలిస్తే సెన్సెక్స్ సుమారు 200 పాయింట్ల లాభంతో ప్రారంభమై, ఉదయం 10 గంటల సమయానికి 370 పాయింట్లు పెరిగి 78,132 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 107 పాయింట్లు లాభపడి 24,378 వద్ద కొనసాగుతోంది.

వ్యక్తిగత షేర్లలో వెర్నోవా టీడీ, రాడికో ఖైతాన్, హిటాచీ ఎనర్జీ, సీజీ పవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉండగా.. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎంసీఎక్స్ ఇండియా, సుజ్లాన్ ఎనర్జీ, కేపీఐటీ టెక్, బీఎస్‌ఈ లిమిటెడ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. రంగాల వారీగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ 345 పాయింట్లు, నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 130 పాయింట్లు లాభపడగా.. బ్యాంకింగ్ రంగ షేర్లలో కనిపిస్తున్న కొనుగోళ్ల జోరు మార్కెట్‌కు ప్రధాన బలంగా నిలిచింది.‍‍‍‍‍‍‍‍‍‍‍