స్మగ్లర్ల పాలిట సింహస్వప్నం హంటర్..

  • హంటర్ డాగ్ వస్తుందంటే స్మగ్లర్లు పరుగో.. పరుగు..
  • రాష్ట్ర అటవీ శాఖలో ఒకే ఒక్క డాగ్ స్క్వాడ్ బృందం..
  • భయాందోళనకు గురవుతున్న వేటగాళ్లు..

జన్నారం, ఆంధ్రప్రభ : హంటర్ డాగ్ వస్తుందనే వార్త వింటేనే కలప స్మగ్లర్ల, వన్యప్రాణుల వేటగాళ్ల గుండెల్లో పరుగులు. వారందరి పాలిట హంటర్ డాగ్ సింహ స్వప్నంగా నిలుస్తుంది.ఇప్పటివరకు హంటర్ డాగ్ సేవలు బేష్.రాష్ట్ర అటవీ శాఖలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల టైగర్ రిజర్వ్ లోని జన్నారం అటవీ డివిజనల్ కేంద్రంగా ఒకే ఒక్క హంటర్ డాగ్ స్క్వాడ్ బృందం ఉంది.రాష్ట్ర అటవీ శాఖలోని ఎక్కడ క్లిష్టమైన వన్యప్రాణుల వేట,కలప స్మగ్లింగ్ జరిగిన ఆ ప్రాంత అటవీ అధికారుల ఆదేశాల మేరకు ప్రదేశానికి శిక్షకుడైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎల్. అనిల్ నాయక్ తో హంటర్ డాగ్ క్షణాల్లో చేరుకుంటుంది.

ఆ తర్వాత నేర పరిశోధనలో స్మగ్లర్ల,వేటగాళ్ల దుస్తులు, చెప్పులు,వాళ్లు వాడిన ఎలాంటి వస్తువులైన పసిగట్టి వారిని క్షణాల్లో ఇట్టే పట్టుకుంటుంది. ఆ ప్రదేశానికి హంటర్ డాగ్ బృందం వచ్చిందనే సమాచారం చెవిలో పడితే చాలు నేరం చేసిన స్మగ్లర్లు,వేటగాళ్లు గజ గజ వణుకుతూ చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. లేదంటే ఆ నేరస్తులపై హంటర్ డాగ్ పడి హంగామచేస్తుంది. అందుకే నేరస్తులు చేతులు ముడుచుకొని కింద కూర్చోవాల్సిందే.

ప్రత్యేక శిక్షణ పొందిన హంటర్ డాగ్ స్క్వాడ్ బృందం..

రాష్ట్రంలోని కవ్వాల టైగర్ రిజర్వ్ లోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఎల్. అనిల్ నాయక్,రంగు పరమేశ్వర్ లు 2025 జనవరి 25న అటవీ శాఖ తరపున హర్యాన రాష్ట్రలోని పంచకుల ఐటీబీపీ వెళ్లి, ఆ ట్రైనింగ్ సెంటర్ లోనే ఇచ్చిన హంటర్ డాగ్ తో శిక్షణ పూర్తి చేసి,ఆగస్టు 11న తిరిగి జన్నారం అటవీ డివిజన్ కేంద్రానికి చేరుకున్నారు.

తొలి కేసులో స్మగ్లర్ ను పట్టించిన హంటర్..

హంటర్ డాగ్ వచ్చిన 3 రోజుల్లోనే జన్నారం ఫారెస్ట్ బీటు అడవుల్లో ఓ విలువైన టేకు చెట్టును నరికి వేశారు.వెంటనే హంటర్ డాగ్ తో స్క్వాడ్ బృందం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు అనిల్,పరమేశ్వర్ ఆ ప్రాంతానికి వెళ్లి డాగ్ కు స్మగ్లర్ వదిలిన ఓ గుడ్డను వాసన చూయించగానే హంటర్ పరుగులు తీసి మండలంలోని జువ్విగూడ గ్రామవాసైన గిరిజన నేరస్తున్ని పట్టిచింది.అలా మొదలై 2025 నవంబర్ 26న జగిత్యాల జిల్లా రాయికల్ ఫారెస్ట్ రేంజులోని బోర్నపల్లి దక్షిణ బీటు 4 టేకు చెట్లను గుర్తుతెలియని స్మగ్లర్లు నరికివేశారు. ఈ సమాచారం మేరకు స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్ ఆదేశాలతో స్క్వాడ్ బీట్ ఆఫీసర్ అనిల్, హంటర్ తో ఆ ప్రదేశానికి వెళ్లి లభించిన ఆధారాలను దాగుకు వాసన చూయించగానే రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెట్లు నరికిన స్మగ్లర్ ఆంజనేయులును పట్టుకుంది. దీంతో అతను తానే ఆ చెట్లు నరికినట్లు నేరం ఒప్పుకున్నాడు.

ఇలా వరుసగా దండేపల్లి మండలంలోని తానిమడుగులో, జన్నారం మండలంలోని చింతగూడ ఆడవుల్లో టేకు చెట్లను నరికిన నిందితులను ఆ డాగు పట్టించింది.తాజాగా గత నెల 26న మంచిర్యాల అటవీ డివిజన్లోని దేవాపూర్ దక్షిణ ఫారెస్ట్ బీట్ లో గుర్తు తెలియని వేటగాళ్లు జింకను హతమార్చి మాంసాన్ని తీసుకెళ్లారు.ఈ విషయమై స్థానిక ఎఫ్డీఓ ఆదేశాల మేరకు హంటర్ తో అనిల్ అక్కడ లభించిన ఆనవాళ్లను వాసన చూపించగా, ఆ డాగ్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని వేటగాళ్ల ఇంటి వద్దకు వెళ్లి గుర్తించింది.ఆ వేటగాళ్లు ఆ జింకను ఊర కుక్కలు దాడి చేసి హతమార్చగా, ఆ జింకను కోసి మాంసాన్ని తీసుకొని వచ్చామని నేరం ఒప్పుకున్నారు.

ఆ తర్వాత గత నెల 28న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని రేంజులోని భీంపూర్ అటవీ ప్రాంతంలో ఓ జింకను వేటగాళ్లు హతమార్చారని సమాచారంతో హంటర్ తో గాలించి,ఆ జింక చర్మాన్ని స్వాధీనం చేసుకొని,వేటగాడైన ఆత్రం గంగు ఇంటి పరిసరాల్లో రక్తపు మరకలను,గొడ్డలిని, వండిన మాంసం, ఎముకలను గుర్తించి,ఈ ఘటనలో 21 మంది ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో డాగ్ తో ఐదుగురిని అరెస్ట్ చేయగా 16 మంది పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారందరినీ జైలుకు పంపించారు.దీంతో స్మగ్లర్ల, వేటగాళ్ల గుండెల్లో హంటర్ పేరు వింటేనే పరుగులీడుతున్నాయి.

హంటర్ సేవలను వినియోగించుకోవాలి..

డాగ్ స్క్వాడ్ బృందంతో హంటర్ సేవలను నేరం జరిగినప్పుడు అటవీ అధికారులు అందరూ వినియోగించుకోవాలని స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్ తెలిపారు.హంటర్ డాగ్ చాలా తెలివైందని, నేరస్తులను చాకచక్యంగా పట్టుకుంటుందని, డాగ్ స్క్వాడ్ బృందం పనితీరు బాగుందని ఆయన చెప్పారు. వన్యప్రాణులను వేటాడడం,చెట్లను నరకడం పట్ల నేరస్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నామని, పదేపదే నేరానికి పాల్పడితే ఆ నేరస్తులను వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం కఠిన శిక్షలు పడేలాగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.