Women’s T20 WC | ఫైనల్ ఫైట్..
- ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య టీ20 వరల్డ్ కప్ ఫైనల్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్..
ఆంధ్రప్రభ, క్రీడా విభాగం : దాదాపు నెల రోజులుగా క్రికెట్ అభిమానులను అలరించిన మహిళల టీ20 ప్రపంచకప్‌కు నేడు తెరపడనుంది. ఆతిథ్య ఇంగ్లండ్ వేదికగా జూన్ 12న ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొనగా.. నేడు (జూలై 5న) క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఈసారి నిరాశపరచగా, అత్యధికంగా 6 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుతూ ఫైనల్ చేరింది. ఇక స్వదేశంలో ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టు సైతం అజేయంగా దూసుకుపోతూ టైటిల్ వేటలో నిలిచింది. దీంతో ఈ రెండు అగ్రశ్రేణి జట్లలో ఈ ఏడాది కొత్త ప్రపంచ విజేతగా ఎవరు నిలుస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరోవైపు, ఈ టోర్నీలో భారత మహిళల జట్టు ప్రయాణం తీవ్ర నిరాశతో ముగిసింది. గ్రూప్-ఎలో లీగ్ మ్యాచ్‌లు ఆడిన టీమిండియా సెమీఫైనల్ రేసు నుండి లీగ్ దశలోనే నిష్క్రమించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత్.. పాకిస్థాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లపై ఘన విజయాలు సాధించినప్పటికీ, కీలకమైన మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది.
ముఖ్యంగా లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత జట్టు నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 6 వికెట్ల తేడాతో ఛేదించడంతో భారత్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఆసీస్‌పై 27 బంతుల్లోనే 56 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. ఫలితంగా మెరుగైన రన్‌రేట్ సాధించలేక పాయింట్ల పట్టికలో మూడో స్థానానికే పరిమితమై, ఒట్టి చేతులతో స్వదేశానికి తిరుగుపయనమైంది. దీంతో టైటిల్ రేసు నుంచి ముందుగానే తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అందరి దృష్టి ఫైనల్‌పైనే ఉంది. వరల్డ్ కప్ ట్రోఫీని ఎత్తేది ఆతిథ్య ఇంగ్లండా.. లేక మరోసారి ఆస్ట్రేలియా ఆధిపత్యం చాటుకుంటుందా.. అన్న ఉత్కంఠ నెలకొంది.
ఫైనల్ మ్యాచ్ లో తుది జట్లు :
ఫైనల్ లాంటి కీలక మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయకుండా గత మ్యాచ్‌లో ఆడిన ప్లేయింగ్ ఎలెవెన్‌తోనే బరిలోకి దిగాయి. విజయవంతమైన కాంబినేషన్‌ను కొనసాగించాలనే ఉద్దేశంతో జట్టు యాజమాన్యాలు అదే జట్టుపై విశ్వాసం ఉంచాయి.
ఇంగ్లాండ్ మహిళల తుది జట్టు: అమీ జోన్స్ (వికెట్ కీపర్), డానియెల్ నికోల్ వ్యాట్-హాడ్జ్, నాట్ సైవర్-బ్రంట్ (కెప్టెన్), ఆలిస్ క్యాప్సీ, హీథర్ నైట్, ఫ్రేయా కెంప్, డానియెల్ గిబ్సన్, చార్లీ డీన్, లిన్సీ స్మిత్, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ బెల్
ఆస్ట్రేలియా మహిళల తుది జట్టు: జార్జియా వోల్, బెత్ మూనీ (వికెట్ కీపర్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, యాష్లీ గార్డనర్, జార్జియా వేర్హామ్, అన్నబెల్ సదర్లాండ్, నికోలా క్యారీ, సోఫీ మోలినెక్స్ (కెప్టెన్), కిమ్ గార్త్, లూసీ హామిల్టన్
