కూలీ కుటుంబం నుంచి డాక్టరేట్ వరకు

  • యదాద్రి యువకుడి స్ఫూర్తిదాయక విజయగాథ
  • పేదరికం చదువుకు అడ్డుకాదని నిరూపించిన డా. నరసింహ ఎడవల్లి

వలిగొండ, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెలువర్తి గ్రామానికి చెందిన డా. ఎడవెల్లి నరసింహ తన కృషి, పట్టుదలతో డాక్టరేట్ సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

రోజువారీ కూలి పనులతో కుటుంబాన్ని పోషించే మైసయ్య, అండాలు దంపతుల కుమారుడైన నరసింహ, చిన్ననాటి కష్టాలను అధిగమిస్తూ ఉన్నత విద్యలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివిన ఆయన అనంతరం భువనగిరి గురుకుల విద్యాసంస్థలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నల్గొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసి, తరువాత B.Ed., M.Sc., M.A., M.P.A. వంటి పలు ఉన్నత విద్యార్హతలను సంపాదించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సామాజిక శాస్త్ర విభాగంలో “Role of School Management Committee in Empowering School Education – A Descriptive Study of Yadadri Bhuvanagiri District in Telangana State” అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ పొందారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో AISF జెండా కింద విద్యార్థి ఉద్యమాల్లోనూ చురుకుగా పాల్గొని, ఓయూ AISF కౌన్సిల్‌లో నాయకుడిగా విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా డా. నరసింహ మాట్లాడుతూ తన విజయానికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గురువులు, స్నేహితుల ప్రోత్సాహమే కారణమని తెలిపారు. డాక్టరేట్‌ను వారందరికీ అంకితం చేస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ఆచరిస్తూ విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

కూలీ కుటుంబం నుంచి వచ్చి ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన ప్రయాణం గ్రామీణ విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పలువురు విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు అభినందించారు.