రెండున్నర నెలల్లో పెద్ద బ్రిడ్జి నిర్మించడం చారిత్రాత్మకం

  • రూ. 4 కోట్ల 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్
  • కాంట్రాక్టర్ ముంతాజ్ కు ఎమ్మెల్యే ప్రశంసల జల్లు

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని పులిమడుగు సమీపంలో ఎస్‌టీఎస్‌డీఎఫ్ పథకం కింద రూ.4.50 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన వంతెనను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పులిమడుగు వాగుపై సరైన వంతెన లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. రెండున్నర నెలల వ్యవధిలోనే నాణ్యతతో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి చరిత్ర సృష్టించిన కాంట్రాక్టర్ ముంతాజ్ బియ బానిని అభినందించారు.

వంతెన నిర్మాణ పనులను ఆర్‌అండ్‌బీ అధికారులు, స్థానిక సర్పంచ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పనులు వేగంగా పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిధులు మంజూరు చేయించారని వారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

తన సొంత గ్రామంలో రోడ్లు, వంతెనల పనులు ఉన్నప్పటికీ వాటిని తాత్కాలికంగా నిలిపివేసి పులిమడుగు వంతెనను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ముంతాజ్‌ను కోరినట్లు తెలిపారు. షాంపూర్, నాగపూర్ ప్రాంతాల్లో వంతెనల నిర్మాణం సాంకేతిక కారణాలతో జాప్యం అవుతోందని, వర్షాకాలం ముగిసిన వెంటనే ఆ పనులతో పాటు మరో ఐదు, ఆరు చిన్న వంతెనల నిర్మాణం చేపడతామని వెల్లడించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో సాధారణంగా ప్రజాప్రతినిధులను సన్మానిస్తారని, అయితే వంతెన పనులను వేగంగా పూర్తి చేసినందుకు కాంట్రాక్టర్ ముంతాజ్‌ను స్వయంగా ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి అభినందించారు.

హ్యామ్ ప్రాజెక్టు ద్వారా గుడిహత్నూర్ నుంచి ఉట్నూర్ ఐటీడీఏ వరకు, ఉట్నూర్ ఎక్స్‌రోడ్ నుంచి ఆసిఫాబాద్ వరకు రహదారులు, వంతెనల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వెనుకబడిన ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పులిమడుగు సర్పంచ్ ఆడే నీలాబాయి దత్తారం, ఆదిలాబాద్ డీసీసీ ఉపాధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ ఉట్నూర్ టౌన్ అధ్యక్షుడు సయ్యద్ నిసార్, ఆర్‌అండ్‌బీ డీఈ అరవింద్, పంచాయతీరాజ్ డీఈ పవార్ రమేష్, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.