ఓపెన్‌కాస్ట్‌ ఎదుట కార్మికుల నిరసన.. బకాయిల కోసం రోడ్డుపై బైఠాయింపు

ఓపెన్‌కాస్ట్‌ ఎదుట కార్మికుల నిరసన.. బకాయిల కోసం రోడ్డుపై బైఠాయింపు

జైపూర్, ఆంధ్రప్రభ: ఇందారం ఓపెన్‌కాస్ట్‌ ఎదుట కాంట్రాక్ట్‌ కార్మికులు నిరసనకు దిగారు. గుత్తేదారు వరాహ సంస్థ ద్వారా పనిచేస్తున్న సుమారు 300 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు తమకు రావాల్సిన పీఎఫ్‌, బోనస్‌ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఇందారం ఓపెన్‌కాస్ట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు వరాహ సంస్థ చెల్లించాల్సిన మూడు నెలల పీఎఫ్‌, ఏడాది బోనస్‌ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకుడు అరికె సంతోష్‌ యాదవ్‌ ఆరోపించారు. కాంట్రాక్ట్‌ వ్యవధి ఉన్నప్పటికీ, టెండర్‌ను పూర్తిచేయకుండా వరాహ సంస్థ మధ్యలోనే వెళ్లిపోవడంతో కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోయారని అన్నారు.

కార్మికులకు చెల్లించాల్సిన పీఎఫ్‌, బోనస్‌ బకాయిల చెల్లింపులో సంస్థ జాప్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఇదే సమయంలో వరాహ సంస్థకు చెందిన వాహనాలను ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నించగా, కాంట్రాక్ట్‌ కార్మికులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.

సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన ఇందారం, దొరగారిపల్లి, టేకుమట్ల గ్రామాలకు చెందిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు.

ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి చొరవ తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply