రైతులకు తీపి కబురు.. నేడు వంశధార నీటి విడుదల
శ్రీకాకుళం, (ఆంధ్రప్రభ బ్యూరో): ఖరీఫ్ సాగుకు శ్రీకారం చుడుతున్న రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీపి కబురు అందించారు. సోమవారం ఉదయం వంశధార ప్రధాన కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్‌లో మాట్లాడి సాగునీటి విడుదలపై పలు సూచనలు చేశారు. మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో నీటి విడుదల కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
వంశధార ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అరవల రవీంద్రతో పాటు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ నీటి విడుదలను విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. పైప్రాంతాలతో పాటు జిల్లాలోని చివరి ఆయకట్టు భూముల వరకు సమృద్ధిగా సాగునీరు చేరేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
నీటి వృథాను నివారిస్తూ ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశధార కాలువ ద్వారా పలాస వరకు ఉన్న శివారు కాలువలకు కూడా సాగునీరు అందించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని గుర్తుచేశారు.
ఈ ఖరీఫ్ సీజన్‌లో కూడా జిల్లాలోని ప్రతి ఆయకట్టు రైతుకు సాగునీరు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
