గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కన్నాయిగూడెం, (ఆంధ్రప్రభ): ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో నీటి ప్రవాహం గణనీయంగా పెరుగుతోందని కన్నాయిగూడెం తహసీల్దార్ సర్వేర్ తెలిపారు. గత రెండు రోజులుగా గోదావరిలో నీటి ప్రవాహం 2,700 క్యూసెక్కుల నుంచి 65,000 క్యూసెక్కులకు చేరిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ నదిలోకి దిగరాదని, నదిని దాటే ప్రయత్నం చేయవద్దని, అలాగే పశువులు, గొర్రెలను కూడా నది దాటించవద్దని తహసీల్దార్ హెచ్చరించారు. ప్రజలంతా రెవెన్యూ, పోలీసు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.