నిత్య పూజలకు నోచుకోని వీరేశ్వరస్వామి ఆలయం

ఏడేళ్లుగా పూజారికి గౌరవ వేతనం లేదు..

ధూపదీప నైవేద్యానికి కూడా నోచుకోని దేవాదాయ శాఖ ఆలయంపై భక్తుల ఆవేదన

బిక్కనూరు, (ఆంధ్రప్రభ): బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలోని పురాతన వీరేశ్వరస్వామి ఆలయంలో నిత్య పూజలు సక్రమంగా జరగకపోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పూజారికి గత ఏడు సంవత్సరాలుగా గౌరవ వేతనం అందకపోవడంతో పాటు ధూపదీప నైవేద్యానికి కూడా నిధులు లేకపోవడంతో ఆలయ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై పలుమార్లు దేవాదాయ శాఖ అధికారులకు విన్నవించినా ఎలాంటి స్పందన లేదని పూజారి జంగం సిద్ధి రాములు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆలయానికి సంబంధించిన భూములు ఉన్నప్పటికీ వాటిని రైతులు కౌలుకు సాగు చేస్తున్నారని, ప్రభుత్వం ఆలయానికి పాలకవర్గాన్ని నియమించినా ఆలయ నిర్వహణపై ఎలాంటి శ్రద్ధ చూపడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పూజారి తన సొంత ఖర్చులతో ఆలయంలో దీపం వెలిగిస్తూ నిత్యపూజలు కొనసాగిస్తున్నారని తెలిపారు. పురాతన ఆలయం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఆలయంలో నిత్య పూజలు సక్రమంగా జరిగేలా దేవాదాయ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు, గ్రామస్థులు కోరుతున్నారు.