నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు–కారు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతి

వెనుక నుంచి కారును ఢీకొట్టిన బస్సు

కారు నుజ్జునుజ్జు

నలుగురు అక్కడికక్కడే మృతి

మృతులు కాకినాడ వాసులు గుర్తింపు

గ్యాస్ కట్టర్లతో మృతదేహాల వెలికితీత

చిట్యాల, ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

వివరాల్లోకి వెళితే, కాకినాడకు చెందిన కొందరు వ్యక్తులు కారులో విజయవాడ మీదుగా హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్నారు. వారు పెద్దకాపర్తి శివారుకు చేరుకున్న సమయంలో, వెనుక నుండి అతివేగంగా వచ్చిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వారి కారును బలంగా ఢీకొట్టింది.

బస్సు ఢీకొట్టిన తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న వెంటనే చిట్యాల పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను గ్యాస్ కట్టర్ల సాయంతో బయటకు తీశారు. మృతుల వద్ద లభించిన గుర్తింపు కార్డులు, ఆధారాల ఆధారంగా వారిని కాకినాడ వాసులుగా నిర్ధారించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.