El Nino | ఎల్‌నినో.. కిం కర్తవ్యం? రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ కోసం ఎదురుచూపులు
El Nino | కేంద్రం నుంచి అలర్ట్‌లు.. రాష్ట్ర చర్యలపై విమర్శలు
జలవిద్యుత్ ఉత్పత్తిపై ఎల్‌నినో ప్రభావం
సాగు, తాగునీటి సంక్షోభం ముప్పు
ప్రత్యామ్నాయ పంటలపై రైతుల ఆశలు
El Nino | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ఎల్సినోపై రాష్ట్రప్రభుత్వ కార్యాచరణ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా రంగంలోకి దిగలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదురవకముందే జాగ్రత్తలు తీసుకోవడం అనివార్యం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏటేటా కరువు పరిస్థితులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ ఈ సారి ఎల్‌నినో తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం
అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఎల్‌నినో నేపథ్యంలో అనుసరించాల్సిన ముందస్తు వ్యూహాలపై హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఇప్పటికే ఎల్‌నినో ఎఫెక్ట్ మొదలైంది. కృష్ణా బేసిన్లో జూన్, జులైలో రావాల్సిన వరదలు లేకపోవడంతో జల విద్యుదుత్పత్తి భారీగా పడిపోయింది. దీంతో ఈ సీజన్లో జల విద్యుదుత్పత్తిపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఏడాది జూన్‌లోనే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ప్రారంభమైనప్పటికీ ఈ సారి ఇంకా మొదలుపెట్టలేదు. గోదావరి బేసిన్‌తో పోలిస్తే కృష్ణా బేసిన్లో ప్రతీ నీటి చుక్క జలవిద్యుదుత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. మహారాష్ట్ర కోయినా, కర్ణాటకలో అలమట్టి, నారాయణపూర్, తుంగభద్ర, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, పాలేరు అన్ని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో 9 ప్రాజెక్టుల వద్ద 2441 మెగావాట్ల సామర్థ్యంతో 11 జల విద్యుత్ కేంద్రాలు ఉండగా వీటన్నింటికీ నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. దీంతో ఒకవైపు నీటి ఎద్దడి, మరోవైపు విద్యుత్ కోతలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే కేంద్రం మరోసారి రెండో విడత సూచనలతో అప్రమత్తం చేసే అవకాశం ఉందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. విపత్తు నిర్వహణా వంటి కీలక శాఖల్లో ఇప్పటికే కరువును ఎదుర్కొనే కార్యచరణ మొదలై ఉంటే బాగుండేదని ఆయా అధికారులు అభిప్రాయపడటం గమనార్హం. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష జరిగే ఉంటే కదలిక వచ్చేదని వారు పేర్కొంటున్నారు.
తెలంగాణలో బోరుబావులపై ఆధారపడి సాగే వరి వంటి పంటలపై ఇప్పటికే ఎల్‌నినో ప్రభావం మొదలైంది. సాగు విస్తీర్ణం భారీగా తగ్గడంతోపాటు ఆరుతడి పంటలు మొలక దశలోనే ఎండిపోయిన పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు ప్రాజెక్టులకు మరమ్మతులు చేసి ఉంటే ఉత్తర తెలంగాణ వంటి ప్రాంతాల్లో భూగర్భ జలాలకు కొంత మేలు చేకూరి ఉండేదని నీటిపారుదలరంగ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ నెలలోనూ ఎండల తీవ్రత పెరిగి వడగాలులు కూడా వీయడంతో సాగునీటితోపాటు తాగునీటి ఎద్దడి నెలకొంది. ప్రత్యామ్న్యాయ ఏర్పాట్లు చేయాలని సూచించిన కేంద్రం ప్రతిపాదనపై రాష్ట్రప్రభుత్వ తదనంతర కార్యాచరణ గురించి రైతులు ఎదురుచూస్తున్నారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి ఉంటే ఈ విపత్కర పరిస్థితుల్లో రైతాంగానికి మేలు జరిగి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న తీవ్ర దుర్భిక్ష కరువును ఎదుర్కొనేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రత్యేక అధికారులను నియమించాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలైన కందులు, సోయాబిన్, వేరుశనగ, పత్తి వంటి పంటల విత్తనాలను అందించాల్సి ఉండగా ఆ దిశగా కార్యాచరణ కనిపించడం లేదు.
గత 146 ఏళ్ల చరిత్రలో ఈ జూన్ నెల అత్యంత వర్షాభావం నమోదైన నెలల్లో ఒకటిగా నిలవనుందని, జులైలోనూ అదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇది రానున్న విపత్కర పరిస్థితికి అద్దం పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమై, ప్రత్యేకాధికారులతో ప్రతి జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించి రైతాంగాన్ని ఆదుకునే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
