డీజీపీ ఖమ్మం పర్యటనపై ఉత్కంఠ
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో రోజు కార్యక్రమాలకు బ్రేక్
- భద్రాచలం పర్యటన కొనసాగే అవకాశమని పోలీసు వర్గాల సమాచారం
ఖమ్మం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసీస్ (డీజీపీ) సీవీ ఆనంద్ ప్రతిపాదిత ఉమ్మడి ఖమ్మం జిల్లా రెండో రోజు పర్యటన వాయిదా పడింది. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో రెండో రోజు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనాల్సి ఉండగా, అనివార్య కారణాలతో ఆ కార్యక్రమాలను రద్దు చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీంతో అధికార యంత్రాంగంలో ఒక్కసారిగా చర్చ మొదలైంది.
అయితే డీజీపీ పర్యటన పూర్తిగా రద్దు కాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆయన ఖమ్మం చేరుకునే అవకాశముందని సమాచారం. అక్కడి నుంచి నేరుగా భద్రాచలం వెళ్లే అవకాశాలు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా స్థానిక పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఏర్పాట్లు కొనసాగిస్తోంది.
తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీవీ ఆనంద్ తొలిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వస్తుండటంతో పోలీసు శాఖ ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. ఆయన రాకను పురస్కరించుకుని భద్రతా పరమైన ఏర్పాట్లతో పాటు అధికారిక సమావేశాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు.
పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నప్పటికీ భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. డీజీపీ పర్యటనకు సంబంధించిన తదుపరి కార్యక్రమాలపై ఉన్నతాధికారులు నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. అధికారికంగా కొత్త షెడ్యూల్‌పై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు డీజీపీ రాక నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి పర్యటన కొనసాగుతుందనే అంచనాలతో అధికారులు తమ ఏర్పాట్లను సిద్ధంగా ఉంచారు.
