వీడిన ములుగు మర్డర్ మిస్టరీ !
- భర్త హత్య కేసులో సంచలనం..
- 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : అక్రమ సంబంధానికి అడ్డుగా మారాడనే కారణంతో భర్తను తొలగించాలనే ఉద్దేశ్యంతో భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేయించిన ఘటనను ములుగు పోలీసులు చేధించారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ నలువాల రవిందర్ మృతికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజుపేటకు చెందిన సిరిపంగ నర్సింగరావును భార్య శోభారాణి ప్రియుడు ఆలపెద్ద వెంకటేశ్వర్లు, అతని బావ మరిది దుర్గారెడ్డి తో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలిపారు. జూన్ 26న ములుగు మండలం జాకారం గ్రామ శివారులోని మిషన్ భగీరథ ట్యాంక్ వెనక వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని శవం లభ్యం కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
7 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టినట్లు, మృతుడు యాదాద్రి జిల్లా రాజుపేట గ్రామానికి చెందిన నర్సింగరావును భార్య శోభారాణి ప్రియుడితో కలిసి కారులో జాకారం తీసుకువచ్చి నైలాన్ తాడుతో ఉరివేసి చంపి, వ్యవసాయ పొలంలో పడవేసి బండరాయితో ముఖంపై మోది హత్య చేసినట్లు తెలిపారు.
నిందితులను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన నైలాన్ తాడు, రాయిని స్వాధీనం చేసుకున్నట్లు, ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినున్నట్లు తెలిపారు. హత్య కేసును చేధించిన పోలీసులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ములుగు సిఐ సురేష్, సిసిఎస్ సిఐ బండారి కుమార్, ఎస్సై చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

