harish rao | రంకెలు వేసినా అంకెలు మారవు

harish rao | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: రాష్ట్ర అప్పుల అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీశ్‌రావు ఖండించారు. భట్టి వెల్లడించిన వివరాలన్నీ అవాస్తవాలని, వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… నిధులు లేవనే కారణంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ సంక్షేమ పథకాలను నిలిపివేయలేదని హరీశ్‌రావు అన్నారు. “రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవు” అంటూ భట్టి వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం మొత్తం రూ.5.56 లక్షల కోట్ల అప్పు చేసిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారని, అయితే కేసీఆర్ ప్రభుత్వం అధికారాన్ని వీడే సమయానికి చెల్లించాల్సిన అప్పు రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుల అనుభవం అభివృద్ధి కంటే స్కామ్‌లు చేయడానికే ఉపయోగపడుతోందని కూడా ఆయన విమర్శించారు.