ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తపస్ వినతి
జుక్కల్/కామారెడ్డి, (ఆంధ్రప్రభ): ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నాయకులు డిమాండ్ చేశారు. తపస్ ఆధ్వర్యంలో జుక్కల్ తహసీల్దార్ పి. మారుతికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా తపస్ మండల అధ్యక్షుడు జైచంద్, జిల్లా ఉపాధ్యక్షుడు జనార్ధన్, మండల కార్యదర్శి సందీప్ మాట్లాడుతూ పీఆర్సీ నివేదిక మేరకు 51 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. అలాగే ఆరు డీఏలను విడుదల చేయడం, పదోన్నతులు కల్పించడం, టీచింగ్, నాన్‌టీచింగ్ ఖాళీలను భర్తీ చేయడం, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించిందని, తెలంగాణ రాష్ట్ర సాధనలో తపస్ చేసిన కృషిని గుర్తించి ఇప్పటికైనా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ హేమలత పాల్గొన్నారు.
