Harish Rao | హరీష్‌పై ప్రశంసల జల్లు కురిపించిన విజయ్

Harish Rao | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సిద్ధిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రిని శనివారం మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుతో కలిసి ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ సందర్శించారు. ఆస్పత్రిలో గుండె సంబంధిత చికిత్సలు పొందుతున్న చిన్నారులను పరామర్శించిన వారిద్దరూ వారితో కాసేపు సరదాగా గడిపి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన విజయ్ దేవరకొండ, హరీష్ రావుపై ప్రశంసల జల్లు కురిపించారు. తనకు హరీష్ రావు అన్న అంటే ఎంతో అభిమానమని చెబుతూ, ఆయనను “సిద్ధిపేటకా షేర్” అంటూ అభివర్ణించారు.

తెలంగాణలో చిన్నారులకు ప్రత్యేక గుండె వైద్య సేవల అవసరాన్ని ముందుగానే గుర్తించి, హరీష్ రావు ఆరోగ్య మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ఆస్పత్రి ఏర్పాటుకు భూమి కేటాయించారని విజయ్ గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా, నిస్వార్థ సేవాభావంతో చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు.

పేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు అందేలా హరీష్ రావు చేస్తున్న సహకారం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. సమాజ సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేసే నాయకులు ఒక తరం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు.

చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక వైద్య కేంద్రాన్ని సందర్శించడం, అక్కడ అందుతున్న సేవలను ప్రత్యక్షంగా చూడడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని విజయ్ దేవరకొండ తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.