జీవోకు స్వాగతం.. సీఎం, మంత్రి చిత్రపటాలకు క్షీరాభిషేకం
జైనూర్, ఆంధ్రప్రభ: మాంగ్ కులానికి తహసీల్దార్ కార్యాలయాల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని గణేష్‌నగర్‌లో మాంగ్ సమాజ్ నాయకులు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాంగ్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు గాయక్‌వాడ్ తులసీదాస్ మాంగ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం మాంగ్ సమాజ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు మావలే దత్త మాంగ్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా మావలే దత్త మాంగ్ మాట్లాడుతూ, మాంగ్ కులస్తుల చిరకాల డిమాండ్‌ను నెరవేర్చుతూ కుల ధ్రువీకరణ పత్రాలను తహసీల్దార్ కార్యాలయాల ద్వారా జారీ చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం హర్షణీయమన్నారు. గతంలో ఆర్డీవో కార్యాలయాల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చేదని, సకాలంలో పత్రాలు అందక విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఇబ్బందులు పడాల్సి వచ్చేదని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ సమస్యలు తొలగి మాంగ్ కులస్తులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.
తెలంగాణ మాంగ్ సమాజ్ న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం గుర్తించి జీవో జారీ చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి మాంగ్ సమాజ్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాంగ్ సమాజ్ నాయకులు, సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
