స్వర్ణ కుప్పం దిశగా సమగ్ర అభివృద్ధి: సీఎం చంద్రబాబు

రూ.9,321 కోట్ల పెట్టుబడులతో 30 ప్రాజెక్టులు..

రూ.118 కోట్లతో ఆధునిక బస్టాండు, డిపోకు శంకుస్థాపన

కుప్పాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

కుప్పం, ఆంధ్రప్రభ: కుప్పం నియోజకవర్గాన్ని పారిశ్రామిక, వ్యవసాయ, ఆరోగ్య, పర్యావరణ, సాంకేతిక రంగాల్లో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రూ.118 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక బస్టాండు, ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సభలో ఆయన స్వర్ణ కుప్పం దార్శనిక ప్రణాళిక–2029పై విస్తృతంగా వివరించారు.

రాబోయే రోజుల్లో కుప్పం నుంచి ఉద్యోగాల కోసం యువత వలస వెళ్లే పరిస్థితి ఉండదని, ఇతర ప్రాంతాల నుంచే ఉద్యోగాల కోసం కుప్పానికి వచ్చే స్థాయికి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కుప్పంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తున్నానని, ఈ పర్యటన కుప్పం చరిత్రలో ఓ మలుపు అవుతుందని, స్వర్ణ కుప్పానికి ఇది నాంది పలుకుతుందని అన్నారు.

ఒక్కరోజే రూ.9,321 కోట్ల పెట్టుబడులతో 30 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అవగాహన ఒప్పందాలు జరిగాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రత్యక్ష, పరోక్షంగా సుమారు 80 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

ప్రపంచ ప్రఖ్యాత అడిడాస్ సంస్థ కుప్పంలో పాదరక్షల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడం ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. విమాన తయారీ, పాడి పరిశ్రమలు, ఆహార శుద్ధి పరిశ్రమలు, కోళ్ల పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కులు కూడా కుప్పంలో ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలనే లక్ష్యంతో చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని, ఉద్యోగాలు అడిగే యువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

నియోజకవర్గ యువతకు పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. కుప్పాన్ని ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, అధిక ఆదాయం వచ్చే వాణిజ్య, ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు.

రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.1 లక్ష కోట్లతో పూర్వోదయ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని, ఇందులో ప్రభుత్వం రూ.40 వేల కోట్లు, ప్రైవేటు రంగం రూ.60 వేల కోట్లు పెట్టుబడులు పెడతాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు వచ్చే నెలలో మదనపల్లెలో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు.

గతంలో కుప్పంలో ప్రారంభించిన సూక్ష్మ సేద్య విధానం నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరిస్తామని చెప్పారు. పాడి పరిశ్రమను బలోపేతం చేస్తూ రోజుకు 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, మహిళా సంఘాల ద్వారా కమ్యూనిటీ పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

హంద్రీ-నీవా కాలువ ద్వారా కుప్పానికి నీటిని తీసుకొచ్చి ఇప్పటికే 110 చెరువులను నింపామని గుర్తు చేశారు. త్వరలో గంగికోట జలాశయం నుంచి ప్రతి ఇంటికి పైపులైన్ ద్వారా తాగునీరు అందించే ప్రాజెక్టు ప్రారంభమవుతుందని చెప్పారు.

కుప్పాన్ని దేశంలోనే తొలి నెట్ జీరో నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన వేలాది ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేశామని, ఇప్పుడు బీసీ, ఓసీ కుటుంబాలకు చెందిన సుమారు 49 వేల ఇళ్లపైనా రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రతి కుటుంబం తన అవసరాలకు కావాల్సిన విద్యుత్‌ను తానే ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు.

ఇళ్ల మిద్దెలపై కూరగాయల సాగు, ఇంటి వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీని ప్రోత్సహిస్తామని చెప్పారు. వచ్చే రెండేళ్లలో కుప్పంలో పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించి విద్యుత్ ఆధారిత రవాణాకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

రూ.118 కోట్లతో నిర్మించే అత్యాధునిక ఆర్టీసీ డిపో, బస్టాండు కుప్పానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యుత్ బస్సులు, సౌర విద్యుత్ వ్యవస్థలు, ఆహార కేంద్రాలు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాలతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందని, ఆర్టీసీ అవసరాలకు కావాల్సిన విద్యుత్‌ను కూడా సౌరశక్తి ద్వారానే ఉత్పత్తి చేస్తామని చెప్పారు.

తిరుమల తర్వాత రాష్ట్రంలో అత్యధిక హరిత విస్తీర్ణం ఉన్న ప్రాంతం కుప్పమేనని, ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటాలని, ప్రతి రైతు ఉద్యాన పంటలు సాగు చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడితేనే నీటి వనరులు, జీవన ప్రమాణాలు నిలుస్తాయని అన్నారు.

కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో కంప్యూటర్ ఆధారిత శరీర చిత్రీకరణ కేంద్రం, విస్తరించిన మూత్రపిండ శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇకపై ప్రజలు తిరుపతి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.

సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రతి పౌరుడికి డిజిటల్ ఆరోగ్య రికార్డు రూపొందించి ప్రపంచ స్థాయి వైద్య సేవలను ఇంటి వద్దకే అందిస్తామని తెలిపారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే వ్యాధి రాకుండా నివారించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహారం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

అలాగే అతిథి గృహం, ఆధునిక దహనవాటిక, అంత్యక్రియల కోసం ప్రత్యేక వాహనం, మారుమూల గ్రామాల్లో మొబైల్ కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నామని తెలిపారు.

కుప్పం అభివృద్ధి కేవలం మౌలిక వసతులకే పరిమితం కాదని, ఉపాధి, వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణం, సాంకేతికత, జీవన ప్రమాణాలన్నింటిలోనూ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “స్వర్ణ యుగానికి నాంది.. స్వర్ణ కుప్పం” అని పేర్కొంటూ ప్రజల సహకారంతో ఆ లక్ష్యాన్ని సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఆర్టీసీ ఉపాధ్యక్షుడు మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.