ఇన్‌స్టంట్ డెలివరీ సెంటర్‌లో ఎక్స్‌పైరీ ఫుడ్..

  • ఫుడ్ సేఫ్టీ దాడుల్లో షాకింగ్ నిజాలు
  • ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారా..?
  • ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో ఇన్‌స్టామార్ట్‌కు షాక్..

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ద్వారా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు ఆర్డర్ చేసే వినియోగదారులకు ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో వరుసగా ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడుతుండగా.. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ ఇన్‌స్టంట్ డెలివరీ సంస్థ ఇన్‌స్టామార్ట్ కేంద్రంలోనూ పలు లోపాలు వెలుగుచూశాయి.

గడువు ముగిసిన చీజ్, పనీర్, యోగర్ట్, స్మూతీ వంటి ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. గజులరామారంలోని క్విక్‌బాక్స్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇన్‌స్టామార్ట్) కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు.

తనిఖీల్లో శాఖాహార, మాంసాహార పదార్థాలను ఒకేచోట నిల్వ చేయడం, కోల్డ్ స్టోరేజ్ నిర్వహణలో లోపాలు ఉండటం, ఆహారాన్ని నిర్వహించే సిబ్బందికి అవసరమైన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేకపోవడం, అలాగే ఎఫ్‌ఐఎఫ్‌ఓ (First In, First Out), ఎఫ్‌ఈఎఫ్‌ఓ (First Expired, First Out) విధానాలను పాటించకపోవడం వంటి అంశాలను అధికారులు గుర్తించారు.

అంతేకాకుండా గడువు ముగిసిన, దెబ్బతిన్న ఆహార ఉత్పత్తులను వేరుగా నిల్వ చేయడానికి ప్రత్యేక స్థలం లేకపోవడం కూడా బయటపడింది. దీంతో గడువు ముగిసిన చీజ్, పనీర్, యోగర్ట్, స్మూతీ తదితర ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.

హైజీన్ అంచనాలో ఈ కేంద్రానికి 150 మార్కులకు గాను 114 మార్కులు (76 శాతం) మాత్రమే లభించాయి. తనిఖీల అనంతరం సంస్థకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసు జారీ చేశారు అధికారులు. దాంతో పాటు గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారుల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా ఫుడ్ సేఫ్టీ తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఓల్డ్ ట్రీస్ కేఫేలోనూ ఉల్లంఘనలు

మెడ్చల్, కండ్లకోయలోని ఓల్డ్ ట్రీస్ కేఫేలో గడువు ముగిసిన స్వీట్ సాస్, యెల్లో కర్రీ పేస్ట్‌ను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేకపోవడం, మూతలు లేని చెత్తబుట్టలు, వంటకు ఉపయోగించే నీటి నాణ్యత నివేదిక లేకపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు.

ధాబాలో సింథటిక్ రంగులు.. ఫ్రిజ్‌లో చనిపోయిన ఈగలు

బైసాఖీ ఫ్యామిలీ ధాబాలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, ట్రేడ్ లైసెన్సులు ప్రదర్శించకపోవడంతో పాటు గడువు ముగిసిన బేబీ కార్న్, బ్లాక్ పెప్పర్ మసాలా నిల్వ చేసినట్లు గుర్తించారు. చైనీస్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నట్లు తేలడంతో వాటిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.

అంతేకాకుండా ఫ్రిజ్‌లో చనిపోయిన ఈగలు, తుప్పు పట్టిన ఇనుప కత్తులతో వంటలు తయారు చేయడం, వంటశాల రక్షణ వల లేకుండా తెరిచి ఉండటం, నీటి పరీక్షలు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేకపోవడం వంటి తీవ్రమైన లోపాలు బయటపడ్డాయి. తుప్పు పట్టిన కత్తులను తొలగించి వాటి స్థానంలో ఫుడ్-గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ కత్తులు వినియోగించాలని అధికారులు ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.