న్యూఢిల్లీ | ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రయాణించే విమానంపై దాడి చేస్తామంటూ ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ప్రధాని మోడీ ఇవాళ, రేపు అమెరికాలో పర్యటించనున్నారు. ఇటువంటి సమయంలో మోడీ విమానానికి బెదిరింపులు రావడం గమనార్హం. ఈ బెదిరింపు నోట్‌పై ముంబై పోలీసులు ఓ ప్రకటన చేశారు.
మోడీ విదేశాల్లో అధికారిక పర్యటన చేయనున్న నేపథ్యంలో ఈనెల 11న ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్ వచ్చిందని, మోడీ విమానంపై దాడి చేస్తామని అన్నారని అధికారులు తెలిపారు. దీనిపై ఏజెన్సీలకు సమాచారం ఇచ్చామని, దర్యాప్తు జరుగుతోందని వివరించారు. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని చెంబూర్ ప్రాంతం నుంచి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అతను మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని చెప్పారు.