స‌ర్ విధుల్లో అల‌స‌త్వం..

  • న‌లుగురు అధికారుల‌కు షోకాజు నోటీసులు
  • ఓటు భ‌ద్ర‌త‌కు కీల‌క‌మైన స‌ర్‌లో నిర్లక్ష్యం వ‌హిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ స్ప‌ష్టీక‌ర‌ణ‌

ఆంధ్రప్రభ, విజయవాడ : ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన నలుగురు అధికారులకు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఈఆర్వో ఎ. రవీంద్ర, ఏఈఆర్వోలు ఇస్మాయిల్, డి. చంద్రబోస్‌తో పాటు విజయవాడ మధ్య నియోజకవర్గం ఏఈఆర్వో సంజయ్ రత్నకుమార్‌కు ఈ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

సర్ ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియలో ఆశించిన పురోగతి సాధించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం (ECI) మార్గదర్శకాల ప్రకారం జరుగుతున్న ఈ కార్యక్రమం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. విధుల్లో ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యం సహించబోమని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరించారు.