ఇన్స్టాగ్రామ్ పై కేంద్రం సీరియస్ !
ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ : సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై పిల్లల భద్రతకు సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో అశ్లీల కంటెంట్, ముఖ్యంగా పిల్లల లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) త్వరలోనే మెటా సంస్థకు నోటీసులు జారీ చేయనుంది. ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజింగ్ నెట్‌వర్క్‌లో ఇలాంటి కంటెంట్ ఎలా కనిపించిందో, దాన్ని అరికట్టేందుకు కంపెనీ తీసుకున్న చర్యలు ఏమిటో స్పష్టత ఇవ్వాలని కేంద్రం కోరనుంది.
పిల్లల భద్రతపై కేంద్రం ఆందోళన…
పేడ్ యాడ్స్ ద్వారా పిల్లల లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌ను ప్రమోట్ చేశాయన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. అంతేకాకుండా ఈ ప్రకటనల ద్వారా వినియోగదారులను ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు దారి మళ్లించినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలను కేంద్రం అత్యంత సీరియస్‌గా పరిగణిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
భారత చట్టాల ప్రకారం పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్ తయారీ, ప్రచారం, పంపిణీ అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఈ కేసుల్లో ఐటీ చట్టం సెక్షన్ 67, 67Bతో పాటు పోక్సో చట్టం కింద కఠిన శిక్షలు విధించే అవకాశం ఉంది. అదేవిధంగా ఐటీ రూల్స్ 2021 ప్రకారం సోషల్ మీడియా సంస్థలు ఇలాంటి కంటెంట్‌ను వెంటనే గుర్తించి తొలగించాల్సిన బాధ్యత కలిగి ఉంటాయి. ఈ వ్యవహారంపై మెటా సంస్థ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. యాడ్ సిస్టమ్, కంటెంట్ మానిటరింగ్ విధానాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందన్నది కీలకంగా మారింది. వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై ఇప్పటికే ప్రశ్నలు ఎదుర్కొంటున్న మెటాకు, ఈ తాజా పరిణామం మరింత ఒత్తిడిని పెంచినట్లు భావిస్తున్నారు.
