తొమ్మిది నెలలుగా ఇన్‌చార్జిలతోనే కాలయాపన..

  • ఏడు మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో వినియోగదారుల అవస్థలు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లాలో టీజీఎన్‌పీడీసీఎల్ పరిధిలో అత్యంత కీలకమైన బెల్లంపల్లి విద్యుత్ డివిజన్‌కు గత తొమ్మిది నెలలుగా రెగ్యులర్ డివిజనల్ ఇంజనీర్ (డీఈ) లేకపోవడంతో వినియోగదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ డీఈగా పనిచేసిన బానోతు రాజన్నకు గత ఏడాది నవంబర్ చివరి వారంలో పదోన్నతి రావడంతో మంచిర్యాల ఎస్ఈగా బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతో ప్రాధాన్యత కలిగిన బెల్లంపల్లి డివిజన్‌కు రెగ్యులర్ అధికారిని నియమించకపోవడం ఉన్నతాధికారుల అలసత్వాన్ని, ఈ ప్రాంతంపై ఉన్న నిర్లక్ష్యాన్ని చాటుతోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. బెల్లంపల్లి డివిజన్ పరిధిలో ఏడు మండలాలు, ఒక మున్సిపాలిటీ కలిపి మొత్తం దాదాపు 80 వేల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.

ఇంతటి పెద్ద డివిజన్‌ను ఇన్ఛార్జ్ అధికారులతో నడిపించడం వల్ల క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించి సమస్యలు పేరుకుపోతున్నాయి. ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు పూర్తిస్థాయి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోవడంతో విధి నిర్వహణ నామమాత్రంగా మారింది. ఎంతో డిమాండ్, రాబడి ఉన్న బెల్లంపల్లి డివిజన్‌పై అధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు గడ్డం వినోద్, సంస్థ సీఈ, మంచిర్యాల ఎస్ఈ స్పందించి, బెల్లంపల్లికి వెంటనే రెగ్యులర్ డీఈని నియమించాలని విద్యుత్ వినియోగదారులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.