Godavari-Railway-Bridge : గోదారి బ్రిడ్డికి ఆపరేషన్​ Andhra Prabha Top News

Godavari-Railway-Bridge : గోదారి బ్రిడ్డికి ఆపరేషన్​ Andhra Prabha Top News

  • పునరుద్ధరణ పనుల్లో రైల్వే బిజీబిజీ
  • 500 కేబుళ్ల మార్పిడి పూర్తి
  • ఇంకా 172 కేబుళ్లు మార్చాలి
  • రైళ్ల రాకపోకలకు నో బ్రేక్​
  • హైటెక్నాలజీ వినియోగం .
  • 28 స్పాన్లలో 20 స్పాన్ల పనులు..
  • 272 స్మార్ట్ సెన్సర్లతో 24 గంటల బ్రిడ్జి పరిరక్షణ..
  • వారసత్వానికి భద్రత
  • మన్నిక పెంపునకు జాగ్రత్తలు
  • చరిత్రకు చెక్కుచెదరని సేఫ్టీ

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో)

దేశంలోనే అత్యంత చారిత్రక ప్రాధాన్యం కలిగిన రాజమహేంద్రవరం గోదావరి బో స్ట్రింగ్ ఆర్చ్ రైల్వే వంతెన పునరుద్ధరణ పనుల్లో దక్షిణ తీర రైల్వే కీలక మైలురాయిని అధిగమించింది. మొత్తం 672 తుప్పు పట్టిన హ్యాంగర్ కేబుళ్లలో 500 కేబుళ్లను విజయవంతంగా మార్చడంతో పాటు, 28 స్పాన్లలో 20 స్పాన్ల పనులను పూర్తి చేసింది. రైళ్ల రాకపోకలకు ఏమాత్రం అంతరాయం కలగకుండా ఈ భారీ పునరుద్ధరణ పనులను నిర్వహించడం భారతీయ రైల్వే చరిత్రలోనే తొలి ఘట్టంగా నిలిచింది.

Godavari-Railway-Bridge : అత్యంత రద్దీ కీలక లైన్లో….

దక్షిణ తీర రైల్వే ఆధ్వర్యంలో విజయవాడ–విశాఖపట్నం ప్రధాన రైల్వే మార్గంలో ఉన్న గోదావరి బో స్ట్రింగ్ ఆర్చ్ రైల్వే వంతెన (బ్రిడ్జి నెం.248) పునరుద్ధరణ పనులు అంతర్జాతీయ ప్రమాణాలతో వేగంగా కొనసాగుతున్నాయి. దశాబ్దాల నాటి డీనా హ్యాంగర్ కేబుళ్ల స్థానంలో తుప్పు నిరోధకత కలిగిన అత్యాధునిక కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 500 కేబుళ్ల మార్పిడి పూర్తి కాగా, 20 స్పాన్ల పనులు కూడా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు భారతీయ రైల్వేలో అత్యంత క్లిష్టమైన వంతెన పునరుద్ధరణ పనుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతి కేబుల్ మార్పిడి ప్రక్రియను వంతెన నిర్మాణ స్థిరత్వాన్ని కాపాడుతూ, నిరంతర రైలు రాకపోకల మధ్య అత్యంత జాగ్రత్తగా చేపడుతున్నారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం

యూరప్‌ నుంచి దిగుమతి చేసిన అధిక బలం కలిగిన పీఎస్‌సీ స్ట్రాండ్లు, నాలుగు పొరల తుప్పు నిరోధక రక్షణ వ్యవస్థ, వ్యాక్స్‌తో నింపిన యాంకరేజీలు, ఆధునిక స్ట్రెస్సింగ్ విధానాన్ని ఉపయోగించడం ద్వారా వంతెన భద్రత, మన్నిక, సేవా కాలాన్ని గణనీయంగా పెంచుతున్నారు. ఇటలీకి చెందిన కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ నిపుణుల సాంకేతిక మార్గదర్శకత్వంతో పాటు ఐఐటీ ముంబయి ఇంజినీర్ల పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయి. వంతెన నిర్మాణ స్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ఆస్ట్రేలియా నిపుణుల సహకారంతో అత్యాధునిక బ్రిడ్జ్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు.

272 స్మార్ట్​ సెన్సార్లు రెడీ

ఇందులో 272కు పైగా స్మార్ట్ సెన్సర్లను అమర్చి, వంతెన కదలికలు, హ్యాంగర్ కేబుళ్లపై ఒత్తిడి, డెక్ ప్రవర్తన, గాలి ప్రభావం, పర్యావరణ పరిస్థితులను 24 గంటల పాటు రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం వైపున ఏర్పాటు చేసిన శాశ్వత బీహెచ్‌ఎంఎస్ ల్యాబ్ ద్వారా క్లౌడ్ ఆధారిత వ్యవస్థతో ఈ సమాచారాన్ని విశ్లేషిస్తూ ముందస్తు నిర్వహణ చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా విజయవాడ రైల్వే డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా మాట్లాడుతూ, చారిత్రక గోదావరి ఆర్చ్ వంతెనపై రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా 500 హ్యాంగర్ కేబుళ్ల మార్పిడి పూర్తి కావడం దక్షిణ తీర రైల్వే ఇంజినీర్ల సాంకేతిక నైపుణ్యానికి, అంకితభావానికి నిదర్శనమన్నారు.

వారసత్వానికి హై సెక్యూరిటీ

వారసత్వ సంపదను పరిరక్షిస్తూనే అత్యున్నత భద్రతా ప్రమాణాలను అమలు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. పనులను పర్యవేక్షిస్తున్న సీనియర్ డివిజనల్ ఇంజినీర్ పి. శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరంతర నిర్మాణ పర్యవేక్షణ, కచ్చితమైన ఇంజినీరింగ్ ప్రమాణాలు, కఠిన భద్రతా నిబంధనల మధ్య అత్యంత శాస్త్రీయంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతి కేబుల్ మార్పిడిని అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తూ, వంతెన నిర్మాణ సమగ్రతను కాపాడుతున్నామని చెప్పారు. ఈఈపీసీ ఒప్పందం కింద చేపట్టిన ఈ పునరుద్ధరణ పనులు నిర్ణీత గడువులో పూర్తికానున్నాయి . పనులు పూర్తయిన అనంతరం దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక రైల్వే వంతెనల్లో ఒకటైన గోదావరి ఆర్చ్ బ్రిడ్జి మరింత భద్రంగా, దీర్ఘకాలం సేవలందించేలా మారడంతో పాటు, దాని చారిత్రక వారసత్వం భావితరాలకు సురక్షితంగా అందుబాటులో ఉంటుందని దక్షిణ తీర రైల్వే అధికారులు తెలిపారు.