విద్యా రంగ సమస్యల పరిష్కారానికి బంద్..
- పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు
నర్సంపేట, ఆంధ్రప్రభ : విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఈ మేరకు చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సంపేటలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఏఐఎఫ్‌డీఎస్ డివిజన్ కార్యదర్శి మార్త నాగరాజు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు దిడ్డి పార్థసారథి, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు గుర్రం అజయ్, ఏఐఎఫ్‌డీఎస్ జిల్లా అధ్యక్షుడు జన్ను రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పైసా గణేష్, పీడీఎస్‌యూ నాయకుడు రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని, విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రిని నియమించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు సకాలంలో అందించాలని, మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచి మహిళా సంఘాల ద్వారా అమలు చేయాలని సూచించారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఎంఈఓ, డీఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయడంతో పాటు జీఓ నంబర్లు 7, 8, 9లను రద్దు చేయాలని కోరారు.
ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, అద్దె భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌లు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇంటర్నెట్, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం, బడి బస్సులు ఏర్పాటు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు, డ్రగ్స్ నిరోధక కమిటీలు, అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ఐసీసీ) ఏర్పాటు చేయాలని తెలిపారు.
విద్యాహక్కు చట్టాన్ని సమర్థంగా అమలు చేసి పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని, రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీ హామీలను అమలు చేయాలని కోరారు.
ప్రైవేట్ విద్యాసంస్థల్లో పుస్తకాలు, యూనిఫాంలు, నోట్‌బుక్‌ల బలవంతపు విక్రయాలను నిలిపివేయాలని, జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ–2020)ను తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు సిద్ధు, వంశీ, ప్రశాంత్, కళ్యాణ్, శ్యామ్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
