వర్షాకాలంలో పరిశుభ్రత పాటించాలి..
- నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు: కమిషనర్ గజానంద్
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్‌గల్ పట్టణంలో హోటళ్లు, స్వీట్ హోమ్‌లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇతర తినుబండారాల విక్రయ కేంద్రాల యజమానులకు మున్సిపల్ అధికారులు శుక్రవారం అవగాహన కల్పిస్తూ నోటీసులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గజానంద్ అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గజానంద్ మాట్లాడుతూ, వినియోగదారులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని సూచించారు.
ఆహార పదార్థాలపై ఈగలు, ఇతర క్రిమికీటకాలు వాలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, దుకాణాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని వ్యాపారులకు కమిషనర్ ఆదేశించారు. అలాగే హోటళ్లు, చికెన్, మటన్ దుకాణాల నుంచి వెలువడే చెత్తను చెరువుల వద్ద, ప్రధాన రహదారుల పక్కన వేయకుండా మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే అప్పగించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తెలంగాణ పురపాలక చట్టం ప్రకారం జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వార్డు అధికారులు బి.రాజేశ్వర్, ఎం.రాజేశ్వర్,సానిటరీ ఇన్స్పెక్టర్ సున్నపు ఓంకార్ తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
