TG Employees | నూతన సీఎస్‌ను కలిసిన టీజీవోస్ నేతలు..
TG Employees | నూతన సీఎస్‌ను కలిసిన టీజీవోస్ నేతలు..
పీఆర్సీ, హెల్త్ కార్డులు, డీపీసీల ఏర్పాటు, పెండింగ్ ప్రమోషన్లపై ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఉద్యోగుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని టీజీవోస్ ప్రతినిధుల బృందం వినతి
సీఎం కార్యదర్శులు, ఓఎస్డీతోనూ భేటీ.. సానుకూల స్పందన లభించిందన్న టీజీవోస్
TG Employees | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు, ఐఏఎస్‌ను తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం (టీజీవోస్) రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బి. శ్యామ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు కీలక సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ సందర్భంగా టీజీవోస్ నాయకులు ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) అమలు, హెల్త్ కార్డు సేవలను సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకురావడం, పెండింగ్‌లో ఉన్న డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీలు (డీపీసీలు) అత్యవసరంగా నిర్వహించి అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం ముఖ్యమంత్రి కార్యదర్శులు శేషాద్రి, శ్రీధర్‌తో పాటు ఓఎస్డీ వేముల శ్రీనివాస్‌ను కూడా టీజీవోస్ ప్రతినిధులు కలిశారు. ఉద్యోగుల సమస్యలపై వారు సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వ స్థాయిలో వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు టీజీవోస్ నాయకులు తెలిపారు.
