లారీ అసోసియేషన్‌కు టెండర్లలో ప్రాధాన్యం కల్పిస్తాం

అసోసియేషన్ ఆర్థికంగా బలోపేతం కావడానికి పూర్తి సహకారం
ఆటోనగర్, ఫెన్సింగ్, బైపాస్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
లారీ యజమానుల సంక్షేమానికి ప్రభుత్వ స్థాయిలో కృషి చేస్తా
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి: ది కాకతీయ లారీ ఓనర్స్ , వెల్ఫేర్ అసోసియేషన్ భూపాలపల్లికి సింగరేణి, సివిల్ సప్లై, బొగ్గు రవాణా టెండర్లలో ప్రాధాన్యం దక్కేలా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హామీ ఇచ్చారు. శుక్రవారం జరిగిన లారీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు పులి వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి బొంతల రాజు, ఉపాధ్యక్షుడు కౌటాం సురేందర్, సహాయ కార్యదర్శి మేకల శ్రావణ్, కోశాధికారి చిత్తారి రాకేష్‌లను అభినందించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులు ఐక్యంగా ఉండి దరఖాస్తులు సమర్పిస్తే సింగరేణి, కొత్తగూడెం తదితర సంస్థల అధికారులతో మాట్లాడి టెండర్లు వచ్చేలా కృషి చేస్తానన్నారు. సివిల్ సప్లై, బొగ్గు రవాణా పనులు దళారుల చేతుల్లోకి వెళ్లకుండా స్థానిక లారీ యజమానులకే దక్కేలా ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నిస్తానని చెప్పారు.

అసోసియేషన్ ఆర్థికంగా బలోపేతం కావడమే తన లక్ష్యమని, టెండర్ల ద్వారా వచ్చే అవకాశాలు 300 మంది సభ్యులకు సమానంగా ప్రయోజనం చేకూరేలా కార్యవర్గం చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.

భూపాలపల్లిలో ఆటోనగర్ ఏర్పాటు, లారీ అసోసియేషన్‌కు అవసరమైన స్థలం, ఫెన్సింగ్, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సింగరేణి అధికారులతో చర్చిస్తానన్నారు. అలాగే కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్‌తో సమావేశం నిర్వహించి ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.

ప్రభుత్వ సహకారంతో భూపాలపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ప్రజల ఆశీర్వాదంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, డిసిసి అధ్యక్షులు బట్టు కరుణాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, లారీ యజమానులు తదితరులు పాల్గొన్నారు.