bhatti vikramarka | రూ.8.21 లక్షల కోట్ల అప్పులపై కేసీఆర్ సమాధానం చెప్పాలి

bhatti vikramarka | రూ.8.21 లక్షల కోట్ల అప్పులపై కేసీఆర్ సమాధానం చెప్పాలి

bhatti vikramarka | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చేసిన అప్పులపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో వివిధ మార్గాల ద్వారా మొత్తం రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో గత ప్రభుత్వాల నుంచి వచ్చిన బకాయిలు కూడా ఉన్నాయని, ఇవన్నీ వాస్తవాలు కాదా అని ప్రశ్నించారు. ఈ భారీ అప్పులను చివరకు ఎవరు చెల్లిస్తారని కేసీఆర్‌ను నిలదీశారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడిన భట్టి, ప్రస్తుతం తమ ప్రభుత్వం అప్పులు తెస్తూనే సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు తీసుకున్న రుణాల కారణంగా రాష్ట్రంపై ఆర్థిక భారం పెరిగిందని, ఇప్పుడు వాటిని రీస్ట్రక్చరింగ్ చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై కూడా భట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “కేటీఆర్‌కు గతం లేదు.. భవిష్యత్తు లేదు. హరీశ్‌రావుకు కూడా అదే పరిస్థితి” అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకుండా, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక సింగరేణి అంశాన్ని ప్రస్తావించిన భట్టి విక్రమార్క, సంస్థ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సింగరేణిలో తాజాగా కొత్త బొగ్గు బ్లాకులను అందుబాటులోకి తీసుకొచ్చామని, దీని ద్వారా ఉత్పత్తి పెరగడంతో పాటు ఉద్యోగావకాశాలు కూడా మెరుగుపడతాయని తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు రోజురోజుకూ మరింత వేడెక్కుతున్న వేళ భట్టి విక్రమార్క చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అప్పులు, ఆర్థిక నిర్వహణ, సింగరేణి అభివృద్ధి వంటి అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు-ప్రతివిమర్శలు మరింత తీవ్రం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.