పత్తి రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీ..
ఉత్పాదకత పెంపే ప్రభుత్వ లక్ష్యం
మిషన్ 2026-27 కింద రైతులకు ప్రోత్సాహం.. శాస్త్రీయ సాగుతో అధిక దిగుబడులు సాధించాలని సూచన
ఊట్కూర్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం పత్తి ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో అమలు చేస్తున్న మిషన్ 2026-27 పథకం కింద రైతులకు సబ్సిడీపై పత్తి విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు సింగిల్ విండో అధ్యక్షుడు బాల్‌రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు డి. యగ్నేశ్వర్‌రెడ్డి తెలిపారు.
శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ రైతు వేదిక భవనంలో రైతులకు సబ్సిడీ పత్తి విత్తనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని నాణ్యమైన విత్తనాలతో సాగు చేపట్టాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తే పత్తి దిగుబడులు పెరగడంతో పాటు సాగు వ్యయం తగ్గి రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని చెప్పారు.
వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక సూచనలు అందిస్తూ పంటల నిర్వహణలో సహకరిస్తారని తెలిపారు. 250 ఎకరాల్లో సాళ్ల పద్ధతిలో పత్తి సాగు చేపట్టాలని రైతులకు సూచించారు.
ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోందన్నారు. రైతులు అధికారిక కేంద్రాల ద్వారానే విత్తనాలు కొనుగోలు చేసి రశీదులను భద్రపరచుకోవాలని, నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కథలప్ప, ఉప సర్పంచ్ రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎం. భరత్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోరం మహేష్‌రెడ్డి, మైనారిటీ మండల అధ్యక్షుడు జలాల్, ఏఈవోలు, కాంగ్రెస్ కార్యకర్తలు కొక్కు శంకర్, రవికుమార్, చందు, రాఘవేందర్ గౌడ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
