పశ్చిమ టీడీపీ పగ్గాలు ఎవరికి?..

  • జిల్లా కార్యాలయంలో రాజకీయ సందడి…
  • అభిప్రాయాల సేకరణతో వేడెక్కిన పశ్చిమ ఇన్‌చార్జి రేసు..
  • బుద్ధా వెంకన్నకు పెరుగుతున్న మద్దతు…
  • 17 మంది డివిజన్ అధ్యక్షుల లేఖలు..
  • అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం..
  • కేసినేని చిన్ని కొనసాగినా, మెజారిటీ అభిప్రాయానికి అనుగుణంగా నియామకం జరిగినా పూర్తి సహకారం…
  • పార్టీ శ్రేణుల ఏకగ్రీవ తీర్మానం

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి ఎంపిక చుట్టూ రాజకీయ ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన టీడీపీ అధిష్ఠానం, పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే అంశంపై క్షేత్రస్థాయి అభిప్రాయాలను తెలుసుకునేందుకు చేపట్టిన ప్రక్రియ గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఉత్కంఠభరితంగా సాగింది. నాయకులు, కార్యకర్తలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించగా, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు గణనీయమైన మద్దతు లభించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇన్చార్జి ఎవరు…

విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి శాశ్వత రాజకీయ నాయకత్వాన్ని ఖరారు చేసే దిశగా తెలుగుదేశం పార్టీ కీలక అడుగులు వేస్తోంది. జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, రీజినల్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు సమక్షంలో నిర్వహించిన అభిప్రాయాల సేకరణకు డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, కన్వీనర్లు, యూనిట్ ఇన్‌చార్జులు, బూత్ ఇన్‌చార్జులు, ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు, సీనియర్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పరిశీలకులు ప్రతి నాయకుడిని విడివిడిగా పిలిచి గోప్యంగా అభిప్రాయాలను నమోదు చేశారు. వ్యక్తిగత అభిరుచులు కాకుండా పార్టీ భవిష్యత్తు, సంస్థాగత బలోపేతం, విజయావకాశాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించాలని సూచించారు.

బలమైన పోటీ.. వెంకన్న వైపు మొగ్గు…

పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి కోసం మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎంఎస్ బేగ్, నాగుల్ మీరా, డూండి రాకేష్, ఫతావుల్లా పేర్లు ప్రధానంగా వినిపించాయి. అయితే క్షేత్రస్థాయిలో పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేసిన అనుభవం, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర కారణంగా బుద్ధా వెంకన్నకు అధిక మద్దతు వ్యక్తమైనట్లు సమాచారం.

ఇటీవల కూడా పార్టీ తరఫున అమరావతి, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలపై ఆయన చురుకుగా స్పందిస్తూ వస్తున్నారు. ప్రతిపక్ష పార్టీని ఎదుర్కోవడంలో సమర్థవంతంగా ఉన్న బుద్ధ వెంకన్న వైపే మొగ్గుచూపుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే 17 మంది డివిజన్ అధ్యక్షులు బుద్ధా వెంకన్నకు మద్దతుగా లేఖలు అందజేయగా, 85 మందికిపైగా నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు కూడా ఆయన పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది.

చిన్ని సమక్షంలో కార్యకర్తలతో ముచ్చట..

ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్ (చిన్ని) జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకుని నాయకులు, కార్యకర్తలతో కొద్దిసేపు ముచ్చటించారు. పార్టీ బలోపేతమే అందరి లక్ష్యంగా ఉండాలని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తూ సమష్టిగా పనిచేయాలని సూచించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.

అభిప్రాయాల సేకరణలో పాల్గొన్న దాదాపు అన్ని వర్గాల నాయకులు ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ అధిష్ఠానం కేసినేని చిన్ని ఇన్‌చార్జిగా కొనసాగించాలని నిర్ణయిస్తే సంపూర్ణ సహకారం అందిస్తామని, లేనిపక్షంలో మెజారిటీ నాయకులు, కార్యకర్తలు సూచించిన వ్యక్తిని నియమించినా అదే స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

అధిష్ఠానం ముందు కీలక నివేదిక..

ఈ అభిప్రాయాల సేకరణ నివేదికను పార్టీ రాష్ట్ర నాయకత్వానికి పంపనున్నట్లు పార్టీ ముఖ్య నేతలు ఆంధ్రప్రభ కు ప్రత్యేకంగా తెలిపారు. గత కొంతకాలంగా క్షేత్రస్థాయి సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై టీడీపీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. నాయకుల ఎంపికలో కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకే ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి నియామకంపై అధిష్ఠానం తీసుకునే తుది నిర్ణయంపై ఇప్పుడు విజయవాడ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.