మోతె పీహెచ్‌సీని తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్

గతంలో బదిలీ అయిన వైద్యాధికారి చేతిలోనే అధికారాలు ఉన్నాయంటూ ఆరోపణ

మోతె, ఆంధ్రప్రభ: మోతె మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సౌకర్యాల కొరత, వైద్యులు, సిబ్బంది లేకపోవడం, మందుల కొరత, పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోవడం వంటి సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పీహెచ్‌సీ అభివృద్ధికి అదనపు భవనాలు, సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేసినప్పటికీ ప్రస్తుతం వాటిని పట్టించుకోవడం లేదన్నారు. అలాగే రెండున్నరేళ్ల క్రితమే బదిలీ అయిన మాజీ వైద్యాధికారి డాక్టర్ షేక్ నజియా పేరుతోనే పరిపాలనా వ్యవహారాలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ, దీనిపై జిల్లా వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ కిట్‌కు పేరు మార్చడమే తప్ప లబ్ధిదారులకు సకాలంలో కిట్లు అందించడం లేదని, కంటి వెలుగు వంటి ప్రజాదరణ పొందిన పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మల్లయ్య యాదవ్ విమర్శించారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని, పీహెచ్‌సీల్లో వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల ఖాళీలను భర్తీ చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శీలం సైదులు యాదవ్, జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ లింగారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.