రైతులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యం..

రాజముద్రతో పాస్ పుస్తకాలు..
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..
అక్కపాలెంలో అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
భూ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం
గత ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైంది…
పెండింగ్ భూ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తం..
పారదర్శక రెవెన్యూ సేవలతో రైతులకు మెరుగైన సేవలే లక్ష్యం…

తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు మండలం అక్కపాలెంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అర్హులైన రైతులకు రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. భూ హక్కుల పరిరక్షణ, రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, రెవెన్యూ సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని, పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ముద్రించి భూ సమస్యలు, మ్యూటేషన్లు, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ వంటి అంశాలను సంవత్సరాల పాటు పెండింగ్‌లో ఉంచి రైతులను ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ రైతులకు న్యాయం చేస్తోందని, రైతు హక్కుల పరిరక్షణతో పాటు పారదర్శక పరిపాలన ద్వారా మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో, ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులు, కూటమి నాయకులు, రైతులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.