వికసిత్ భారత్ గ్యారెంటీ అమలుతో కూలీల వేతనాలు పెంపు

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతమని ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంతాల ఆర్థిక రూపురేఖలను మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వికసిత్ భారత్–గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్–గ్రామీణ్ (వీబీజీ రామ్‌జీ) పథకాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు.

భీమవరం మండలం రాయలం గ్రామంలో గురువారం జరిగిన వీబీజీ రామ్‌జీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాత ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ స్థానంలో వచ్చిన ఈ కొత్త చట్టం ద్వారా ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజుల బదులుగా 125 రోజుల పనిదినాల చట్టబద్ధ హామీ లభిస్తుందని తెలిపారు.

దేశవ్యాప్తంగా రోజువారీ సగటు కూలి రేటును రూ.298.8 నుంచి రూ.327.4కు పెంచారని, సగటున రోజుకు రూ.28.6 మేర పెరుగుదల జరిగిందని ఆయన వివరించారు. కనీస వేతనం రూ.300 కంటే తక్కువ ఉండకూడదనే నిబంధనతో ఒక ఇంటర్మీడియట్ బేస్ వేజ్ రేట్‌ను కేంద్రం ప్రవేశపెట్టిందని చెప్పారు.

రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సగటున 10 శాతానికి పైగా కూలి రేట్లు పెరిగాయని, సమృద్ధికరమైన గ్రామాల ద్వారా వికసిత్ భారత్ నిర్మాణంలో ఇది చారిత్రాత్మక అడుగని పేర్కొన్నారు.

అర్హులైన ఏ గ్రామీణ కార్మికుడూ ఒక్క రోజు కూడా పని లేకుండా ఉండకూడదన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, పెద్దలు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.