Biodiversity Heritage Site | ఆ ప్రాంతానికి ప్ర‌త్యేక హోదా…

  • అస్సాంలో బోర్జులికి అరుదైన గుర్తింపు..
  • అడవి వరి సంరక్షణకు కీలక ముందడుగు..
  • వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయానికి ఊతం

ఆంధ్ర‌ప్ర‌భ , వెబ్‌డెస్క్ : ప్రాంతాన్ని జీవవైవిధ్య వారసత్వ ప్రదేశం (బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్)గా జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్‌బీఏ) అధికారికంగా ప్రకటించింది. దేశంలో అడవి వరి (Wild Rice) జాతుల సంరక్షణకు చేపట్టిన ప్రత్యేక ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో అడవి వరి సహజ ఆవాసానికి ప్రత్యేక రక్షణ లభించనుంది.

అడవి వరి జాతులు భవిష్యత్తులో వాతావరణ మార్పులను తట్టుకునే కొత్త వరి రకాల అభివృద్ధికి ఎంతో కీలకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అడవి వరి ప్రస్తుతం సాగు చేస్తున్న వరి రకాల పూర్వీక జాతిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వరదలు, వాతావరణ మార్పులు, తెగుళ్లను తట్టుకునే జన్యు లక్షణాలు ఇందులో ఉండటంతో భవిష్యత్తులో కొత్త వరి రకాల అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

బోర్జులి ప్రాంతంలో సహజంగా పెరుగుతున్న అడవి వరిని పరిరక్షించడంతో జీవవైవిధ్యాన్ని కాపాడటంతో పాటు ఆహార భద్రతకు కూడా తోడ్పాటు అందుతుందని అధికారులు పేర్కొన్నారు. జీవవైవిధ్య పరిరక్షణ చట్టం కింద ఈ హోదా కల్పించడం… ఈ ప్రాంతంలో సంరక్షణ చర్యలు మరింత బలోపేతం కానున్నాయి. ఈ జీవవైవిధ్య వారసత్వ హోదాతో ఆ ప్రాంతంలో సహజంగా పెరిగే అరుదైన అడవి వరి జాతులను పరిరక్షించడంతో పాటు, భారతదేశ వ్యవసాయ జీవవైవిధ్యాన్ని బలోపేతం చేయడానికి అవకాశం లభించనుంది.

కాగా, వ్యవసాయ & రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ‘సోనిత్‌పూర్ జిల్లాలో అడవి బియ్యం (ఒరైజా రుఫిపోగన్) సహజ ఆవాసంలోనే సంరక్షణ, నిర్వహణ’ పేరుతో ఈ ప్రాజెక్టు 2022 నుంచి అమలవుతోంది. జాతీయ వర్షాధార ప్రాంతాల అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌ఏఏ) ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టును ఐసీఏఆర్–జాతీయ వృక్ష జన్యు వనరుల బ్యూరో (ఎన్‌బీపీజీఆర్), న్యూఢిల్లీ మరియు అస్సాం రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి.